హైదరాబాద్: సీఎం ప్రజావాణిలో కొత్తగా ఏర్పాటు చేసిన మీ-సేవా కేంద్రాన్ని సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె.విద్యాసాగర్, మీ సేవా డైరెక్టర్ రవికిరణ్ కలిసి మంగళవారం ప్రారంభించారు.
సీఎం ప్రజావాణికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చే దరఖాస్తుదారులకు వివిధ అంశాలపై సేవలు అందించేందుకు ఉద్దేశించి మీ-సేవా కేంద్రాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ కోసం, వివిధ శాఖల నుంచి పలు అంశాలపై ధ్రువ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ మీ-సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు అన్ని శాఖల డెస్క్ లకు అదనంగా మీ-సేవా కేంద్రం సేవలు సీఎం ప్రజావాణిలో అందుబాటులోకి వచ్చాయి.
కాగా, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో 321 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్ జి.చిన్నారెడ్డి స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి వాటిపై ఎండార్స్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు 144, రెవెన్యూ శాఖకు 51, హోంశాఖకు 25, ప్రవాసి ప్రజావాణికి 2, ఇతర శాఖలకు 99 దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న కంటిన్జెన్సీ ఉద్యోగులు తమకు 18 నెలల వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు అందజేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి.. డీజీపీ సీవీ ఆనంద్ కు ఫోన్ చేసి సమస్యను వివరించి వేతనాలు వెంటనే అందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎసిపి ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నారై సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


