ఢిల్లీ: తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో ఉన్న టీవీకే ప్రభుత్వంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసులు నమోదు చేసిన అధికారులను ఎందుకు శిక్షిస్తోందని నిలదీశారు. రేపు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని తెలిపారు. మెటాపై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్ బాబుని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పని చేసిన అధికారిని శిక్షించారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి డీసీపీ ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు. చట్ట ప్రకారం నడిచే అధికారులపై వేటు వేస్తున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తోందని చెప్పారు.
సింగరేణిపై మాజీ సీఎం కేసీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని, ఆయన కుటుంబం వల్ల అప్పుల పాలైందని కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణిని ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సింగరేణికి రావాల్సిన 54 వేల కోట్ల రూపాయలు బకాయిలు కట్టిస్తామని చెప్పారు.


