చదువు కోసం చాలామంది చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఓ ప్రాంతంలో కొందరు ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రాంతంలో ఇంకొందరు కొండలు, అడవులు దాటి పాఠశాలకు చేరుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో పాఠశాల విద్యార్థులు అంతకంటే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పాఠశాల చిన్నారులు ప్రతిరోజు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేత్వా నదిని కాలినడకన దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు చిన్నారులు నది మధ్యలో ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్‌పై సమతుల్యం పాటిస్తూ నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్ధృ తంగా ప్రవహిస్తున్న నీరు, మరోవైపు పాఠశాలకు చేరాల్సిన అవసరం. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు?
జిల్లా పాలనాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వీడియో విదిశా జిల్లాలోని పాలోహ్ గ్రామానికి చెందింది. వీడియోలో కనిపిస్తున్న చిన్నారులు కరువా గ్రామ నివాసులు. వారు పాలోహ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వీరు రహదారి మార్గంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ అదనంగా 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే స్టాప్ డ్యామ్ దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు.
గత 4-5 ఏళ్లుగా ఇదే దారి
తాము గత 4- 5 ఏళ్లుగా ఇదే దారిలో పాఠశాలకు వెళ్తున్నామని చిన్నారులు చెప్పారు. ఇదే అతి దగ్గర దారి అని, మరో మార్గంలో వెళ్తే చాలా దూరం ఉండటంతో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లడం కష్టమని వివరించారు. వీడియో వైరల్ అయిన తర్వాత పాలనాధికారులు స్పందించారు. విదిశా ఉప విభాగ పాలనాధికారి క్షితిజ్ శర్మ మాట్లాడుతూ.. చిన్నారులు సురక్షిత మార్గంలో పాఠశాలకు వెళ్లి రావడానికి సైకిళ్లు ఇస్తామని చెప్పారు.
నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావిత గ్రామాల దగ్గర కొత్త పాఠశాల ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, చిన్నారులు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుని నది దాటాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం
వీడియో బయటకు వచ్చిన తర్వాత పాలనాధికారులు, విద్యాశాఖపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. చిన్నారులు ఇన్నేళ్లుగా ఇలాగే పాఠశాలకు వెళ్తుంటే ముందే చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నించారు. వీడియో వైరల్ అయ్యేవరకు పాలనాధికారులు ఎందుకు వేచి చూశారని, ఇంతకు ముందే ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


