ఉదయ్‌నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి | Udhayanidhi Stalin Arrested Over Remarks: Viral Drama at Residence | Sakshi
Sakshi News home page

ఉదయ్‌నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి

Aug 4 2026 1:27 PM | Updated on Aug 4 2026 1:52 PM

Udhayanidhi Arrest Drama Goes Viral

డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్‌నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.

తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్‌ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్‌నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

వైరల్‌గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్‌నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్‌నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్‌ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్‌లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.

 VIDEO CREDITS:TimesNow

దీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.

మా. సుబ్రమణియన్‌ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్‌నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్‌నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.

ఏ కేసులో అరెస్ట్‌?
కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్‌నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.

రాజకీయంగా ముదిరిన వివాదం
ఉదయ్‌నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement