న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా ఆగస్టు 5, 2024 నుంచి భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఢాకాలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. నాటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ను పలుమార్లు డిమాండ్ చేసింది. తాజాగా షేఖ్ హసీనా మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె మొదటిసారిగా మీడియా అడిగే ప్రశ్నలకు ఆగస్టు 5న లైవ్‌లో సమాధానాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం..
2024 ఆగస్టులో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ఆమె బంగ్లాదేశ్ వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె కొన్ని లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు కానీ, ఎప్పుడూ నేరుగా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు ఆమె లైవ్‌లో మాట్లాడనున్నారనే వార్తలు రావడంతో, హసీనా స్వయంగా కెమెరా ముందుకు వస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. షేఖ్ హసీనా బుధవారం(ఆగస్టు 5)నాడు అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ సమయంలో ఆమె కెమెరా ముందుకు మాత్రం రారు. ‘ఫస్ట్‌పోస్ట్’ నివేదిక ప్రకారం.. భద్రత, గోప్యతా కారణాల దృష్ట్యా షేఖ్ హసీనా కెమెరా ముందుకు రారని, భారతదేశంలోని ఒక రహస్య ప్రదేశం నుండి కేవలం ఆడియో లింక్ ద్వారా మాత్రమే ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
ప్రసంగంలో ముఖ్యాంశాలివే..
ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియాకు చెందిన ‘ఫారెన్ కరస్పాండెన్స్ క్లబ్’ నిర్వహిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే తమ ప్రణాళికలు, వ్యూహాలను హసీనా ఈ వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. అలాగే, తనపై బంగ్లాదేశ్‌లో నమోదైన కేసులు, అక్కడి ట్రిబ్యునల్ విధించిన తీర్పులపై ఆమె సమాధానం ఇవ్వనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ , మాజీ విద్యా మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి నౌఫెల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో కలకలం.. భారత్‌కు హెచ్చరిక..
ఈ ప్రసంగానికి సంబంధించిన వార్తలు వెలువడగానే బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నాడు ఢాకా వర్గాలు దీనిపై స్పందిస్తూ.. ఆగస్టు 5న షేఖ్ హసీనా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని భారత్‌ను కోరాయి. ఇటువంటి కార్యకలాపాల వల్ల ఇటీవల రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్ మాట్లాడుతూ.. హసీనా కానీ, ఆమెకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేదా అవామీ లీగ్ వంటి నిషేధిత సంఘాల నేతలు కానీ భారత భూభాగం నుండి రాజకీయ ప్రకటనలు చేయడానికి లేదా బంగ్లాదేశ్‌లో అశాంతిని సృష్టించే కార్యకలాపాలకు పాల్పడకుండా భారత్ తగిన చర్యలు తీసుకుంటుందని బంగ్లాదేశ్ ఆశిస్తోందని పేర్కొన్నారు.
డిసెంబర్ నెలలో స్వదేశానికి..
గత నెలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షేఖ్ హసీనా మాట్లాడుతూ.. తన అరెస్ట్ ఖాయమని తెలిసినప్పటికీ, డిసెంబర్ నెలలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పరిస్థితుల్లోనైనా బంగ్లాదేశ్‌కు కచ్చితంగా తిరిగి వెళ్తామని స్పష్టం చేశారు. వలస వెళ్లిన అవామీ లీగ్ నాయకులతో కలిసి స్వదేశానికి వెళ్లి, కోర్టులో లొంగిపోతామని ఆమె పేర్కొన్నారు. కాగా హింసాత్మక నిరసనల సమయంలో అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేఖ్ హసీనాకు మరణశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్


