బంగ్లాదేశ్‌ ముఠా అరెస్ట్‌ | Adilabad Police arrested 3 members of Bangladesh Gang | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ ముఠా అరెస్ట్‌

Aug 4 2026 3:52 AM | Updated on Aug 4 2026 3:52 AM

Adilabad Police arrested 3 members of Bangladesh Gang

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

 తొమ్మిదేళ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న నిందితులు

ఆదిలాబాద్‌టౌన్‌: బంగ్లాదేశ్‌ దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు రట్టు చేశారు. తొమ్మిదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా ఇళ్లలో, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడింది. ఇటీవల ఆదిలాబాద్‌ సమీపంలోని మావల మండలం కైలాస్‌నగర్‌లో గల ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో చోరీకి పాల్పడింది. వీరి నుంచి రూ.8 లక్షల విలువైన 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్‌లోని దీనజ్‌పూర్‌ జిల్లా పర్బత్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ జాని అలీ, మహ్మద్‌ రుమాన్‌ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల ఔట్‌సైడ్‌ చార్‌ దర్వాజాలో ఉంటున్నారు. వీరితోపాటు మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో గల బోగ్‌మోలియకు చెందిన తరుణ్‌ సింగ్‌ 2015 నుంచి రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా జూలై 11న బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సహచరులతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకుంది.

వీరు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్టు నటిస్తూ రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. మహ్మద్‌ జాని అలీ కొన్నేళ్లుగా 12సార్లు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్టు తెలిపారు. భారత్‌లో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, వివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, మావల సీఐ ప్రేమ్‌కుమార్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement