13 నుంచి రాష్ట్ర కోటా..
సాక్షి, హైదరాబాద్: నీట్–యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, ఆగస్టు 13 నుంచి 85 శాతం రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. రెండు కోటాల్లోనూ మూడు ప్రధాన రౌండ్లు, చివరగా స్ట్రే వెకెన్సీ రౌండ్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నీట్ ర్యాంకు, గత ఏడాది కటాఫ్‌లు, కళాశాలల ఫీజులు, బాండ్ నిబంధనలు, హాస్టల్ సౌకర్యాలు, కళాశాల గుర్తింపు తదితర అంశాలను ముందుగానే పరిశీలించాలని చెబుతున్నారు. ముఖ్యంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ‘ఈ సీటు వచ్చే అవకాశం లేదు’అనే భావనతో మంచి కళాశాలలను వదిలేయకుండా, తమకు అత్యంత ఇష్టమైన కళాశాలను మొదటి ప్రాధాన్యంగా పెట్టాలని సూచిస్తున్నారు.
సీట్ల కేటాయింపు పూర్తిగా అభ్యర్థి ఇచి్చన ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి జరుగుతుందని, అందువల్ల ఇష్టమైన కళాశాలలను పై వరుసలో, తరువాత అవకాశాలు ఎక్కువగా ఉన్న కళాశాలలను వరుసగా నమోదు చేయడం మంచిదని చెబుతున్నారు. ఏఐక్యూ, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ వేర్వేరు ప్రక్రియలు కావడంతో, రెండింటికీ అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా రెండింటిలోనూ నమోదు చేసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
ఒక రౌండ్‌లో సీటు రాకపోయినా నిరుత్సాహపడకుండా తదుపరి రౌండ్లలో కూడా పాల్గొనాలని, ప్రతి రౌండ్‌లో ఖాళీల ఆధారంగా కొత్త అవకాశాలు లభిస్తాయంటున్నారు. అలాగే వెబ్ ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత వాటిని ఒకసారి పూర్తిగా పరిశీలించి, గడువు ముగిసేలోగా అవసరమైతే మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎంసీసీ, రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహించే విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లలో విడుదలయ్యే ప్రతి నోటీసును ఎప్పటికప్పుడు గమనిస్తూ, నిరీ్ణత గడువులోనే నమోదు, పత్రాల పరిశీలన, రిపోరి్టంగ్ పూర్తి చేస్తే ప్రవేశాల్లో ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.


