సుమోటోగా విచారణ జరిపే దమ్ముందా? | BJLP Leader Alleti Maheshwar Reddy Chit Chat with Media | Sakshi
Sakshi News home page

సుమోటోగా విచారణ జరిపే దమ్ముందా?

Aug 4 2026 1:40 AM | Updated on Aug 4 2026 1:40 AM

BJLP Leader Alleti Maheshwar Reddy Chit Chat with Media

సర్కార్‌కు ధైర్యముంటే ఎమ్మెల్యే పేరు బయట పెట్టాలి 

ఓ ఎమ్మెల్యే ఏడాదిలోనే వేలం ఆస్తులకు రూ.470 కోట్లు కట్టి ఎట్లా విడిపించారు? 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనీలూటింగ్‌ ఏజెంట్లుగా మారారు 

‘సాక్షి’కథనంపై మీడియా చిట్‌చాట్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మనీ లూటింగ్‌ ఏజెంట్లుగా మారారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఓ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధి వైట్‌ మనీతో వేలానికి వెళ్లిన ఆస్తులను ఎమ్మెల్యే అయిన ఏడాదిలోనే రూ.470 కోట్లు కట్టి ఆస్తులను ఎట్లా విడిపించారని ప్రశ్నించారు. ఏడాదిలో రూ.470 కోట్ల అప్పు ఎలా కట్టారని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుమోటోగా విచారణ నిర్వహించే దమ్మూధైర్యం ఉందా అని సవాల్‌ విసిరారు.

 ‘కాంగ్రెస్‌ సర్కార్‌కు ధైర్యముంటే ఆ ఎమ్మెల్యే పేరు బయట పెట్టాలి. ఆ ఎమ్మెల్యే అవినీతిపై నిజ నిర్ధారణ చేయాలి. అందు­లో సీఎం, డిప్యూటీ సీఎంలకు వాటా లేకపోతే వాస్తవం బయట పెట్టాలి’అని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు ఇంత సంపాదన ఉంటే మంత్రులు, సీఎం ఎంత సంపాదించాలి అనేవిధంగా అనుమానాలు వస్తున్నాయన్నారు. ఏడాదిలో రూ.470 కోట్ల అప్పు కట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరూ అని ప్రశ్నించారు. 

బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మహేశ్వర్‌ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే...అప్పుల కొండ కరిగించేశారు...!’ పతాక శీర్షికతో ప్రచురితమైన సంచలన కథనాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడంతోపాటు బీజేఎల్పీ నేతగానూ ఉన్న మహేశ్వర్‌రెడ్డి ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తీరు, వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో స్పందించారు. 

ఏ ఫైల్‌ కదిలినా 40 శాతం కమీషన్‌ 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తామా అన్న చందంగా దోపి­డీకి పాల్పడుతూ ఎమ్మెల్యే నిర్వచనం మార్చేస్తున్నారని ఏలేటి ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలకు చీఫ్‌ మేనేజర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ లూటీ చేసినట్టుగానే కాంగ్రెస్‌ పోటీ పడుతోంది. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల లూటీ.. ప్రస్తుత అధికార ఎమ్మెల్యేల లూటీతో ప్రభుత్వం అప్పు తీరుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు’అని వ్యాఖ్యానించారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నారు. 

కోటి మంది మహిళలు దేవుడెరుగు వాళ్ల ఎమ్మెల్యేలను వేల కోట్లకు పడగలెత్తిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయితే అవినీతి తాండవిస్తున్నదో... ఆ రాష్ట్ర అభివృద్ధి కుంటు పడుతుంది అందుకు నిదర్శనమే తెలంగాణ’అని అన్నారు. ‘ఈ ప్రభుత్వంలో ఏ ఫైల్‌ కదిలినా 40 శాతం కమీషన్‌ అంటున్నారు. ఉన్న సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టు ఎవరికి వారు పోటీ పడి లూటీ చేస్తున్నారు. మా కోసం కాదు ఢిల్లీకి మూటలు పంపాలని సినిమా డైలాగులు కొడుతున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి’అని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement