ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
భారీయెత్తున నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా సర్కారు అడుగులు
నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూముల విక్రయంపై దృష్టి
టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏల ద్వారా భూములు వేలం వేయించే ఆలోచనలో ప్రభుత్వం
మరోవైపు రెండు సంస్థలకు నెలవారీ టార్గెట్ విధించిన ఉప సంఘం
చెరో వెయ్యి కోట్ల చొప్పున రూ.2 వేల కోట్లు సమీకరించాలని ఆదేశం!
చేతులెత్తేసిన హెచ్‌ఎండీఏ.. ఏకీభవించని సబ్ కమిటీ
హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిల్లో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ,హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలకు చెందిన 923 ఎకరాలు ఉన్నాయి.
సాక్షి, హైదరాబాద్: నిధుల కటకట నుంచి గట్టెక్కే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాదీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, కుంటలు కాకుండా కేవలం ప్రభుత్వ భూములను హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)లకు బదలాయించి, వాటి ద్వారా భూములను వేలం వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగిందని, హైడ్రా భూములను అమ్మేందుకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఆయా భూముల అమ్మకం ద్వారా భారీ మొత్తంలో వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి భూముల స్వాదీన ప్రక్రియలో భాగంగా హైడ్రా అనుసరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయినా హైడ్రా తన తీరును మార్చుకోలేదంటూ కోర్టు పలు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టును కమిషనర్ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తప్పించి, మరొక అధికారిని ఆ స్థానంలో నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా భూములను అమ్మాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. 
వేల ఎకరాలు..వేల కోట్ల విలువ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు కాకుండా ఇప్పటివరకు సుమారు 2,665 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. వాటి విలువ కనిష్టంగా రూ.60 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.90 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటిలో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలకు చెందిన 923 ఎకరాలు.. ఇలా కోట్ల విలువైన భూములు ఉన్నాయి. వీటిల్లో నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములను అమ్మడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూముల వేలం విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని, అన్ని చిక్కులు తొలగిన తర్వాతే పార్శిళ్ల వారీగా (ఒక్కో విడతలో కొన్ని ఎకరాల భూములు) భూములు వేలానికి పెట్టాలని ఉప సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు, మూడు సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే హైడ్రా భూముల అమ్మకాలపై స్పష్టత రానుంది.
మా వల్ల కాదన్న హెచ్‌ఎండీఏ!
ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశాల్లో మరో ఆసక్తికరమైన చర్చ జరిగిందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు గాను భూముల అమ్మకాలే మార్గమనే భావనకు వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ.. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలకు నెలవారీ లక్ష్యాలు సైతం విధించినట్టు సమాచారం. చెరో వెయ్యి కోట్లు చొప్పున ఈ రెండు సంస్థలు నెలకు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూర్చగలిగేలా భూముల వేలం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉప సంఘం సూచించినట్లు తెలిసింది. అయితే నెల వారీ టార్గెట్ విధించడం సరైంది కాదని, వేలం ప్రక్రియ నిర్వహణకు చాలా గడువు అవసరమవుతుందని, ఆ తర్వాత భూములు దక్కించుకున్న సంస్థలు డబ్బులు కట్టేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని, కొన్ని డబ్బులు తాము ఇప్పటికే తెచ్చిన రుణాలకు చెల్లించాల్సి ఉందంటూ హెచ్‌ఎండీఏ అధికారులు చేతులెత్తేసినట్టు సమాచారం. అయినా వారి వివరణతో ఏకీభవించని ఉప సంఘం నిధుల సమీకరణపై వెంటనే సంక్షిప్త నివేదిక తయారు చేయాలని, ఈ నివేదికను సీఎం రేవంత్ సమక్షంలో పరిశీలించి నెలవారీ టార్గెట్లపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.


