కూరలో విషం కలిపిన భార్య.... | Incident in Nizamabad District | Sakshi
Sakshi News home page

కూరలో విషం కలిపిన భార్య....

Aug 4 2026 1:09 AM | Updated on Aug 4 2026 1:09 AM

Incident in Nizamabad District

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్త, అత్తలపై హత్యాయత్నం

మోపాల్‌(నిజామాబాద్‌ రూరల్‌): నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలో సెలైన్‌ ద్వారా టాయిలెట్‌ క్లీనర్‌ ఎక్కించి భర్తను హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఇదే మండలంలో కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తలను హత్య చేయడానికి యత్నించిందో భార్య. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్నకు వర్ని మండలం తిమ్మాపూర్‌కు చెందిన సోనితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భూమన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భర్త, అత్త ఇద్దరూ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన సోని వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ప్రణాళిక వేసింది. ఈనెల ఒకటో తేదీన మధ్యాహ్న సమయంలో మీల్‌మేకర్‌ కర్రీలో గడ్డి మందును కలిపి వడ్డించింది.

ఆ కూరతో అన్నం తిన్న అత్త భూదవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భూమన్న కూడా అదే కూరతో భోజనం చేశాడు. అయితే కూర వాసన రావడంతో తినడం మానేశాడు. అతడు సైతం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించిందని ఎస్సై తెలిపారు. నిందితురాలు సోనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement