వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్‌పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్‌కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్‌స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్‌ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్‌సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్‌ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.
అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.
దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్‌ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది.


