మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్‌ పనే ఇది! | Lashkars Shock Admission, LeT Operative Claims Over 30 Members Killed In Pakistan, Viral Video Sparks Fresh Debate | Sakshi
Sakshi News home page

మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్‌ పనే ఇది!

Aug 4 2026 8:32 AM | Updated on Aug 4 2026 10:22 AM

Lashkars Shock Admission: 30 Plus Operatives Killed in Pakistan Viral

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్‌ హనీఫ్‌ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్‌ హనీఫ్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్‌, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్‌, రావలకోట్‌ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.

“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్‌మెన్‌ మోడల్‌”unknown gunman modelగా అభివర్ణించాడు.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్‌ తరచూ ఈ దాడులకు భారత్‌ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.

తొలిసారి.. ఒప్పుకోలు
లష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 

ఎలా పుట్టింది లష్కరే తోయిబా?
లష్కరే తోయిబా పాకిస్థాన్‌లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్‌ మహ్మద్‌ సయీద్‌, జఫర్‌ ఇక్బాల్‌, అబ్దుల్లా అజామ్‌లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్‌-ఉద్‌-దవా-వల్‌-ఇర్షాద్‌ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్‌-ఆఫ్ఘన్‌ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్‌పై కేంద్రీకరించింది. కశ్మీర్‌లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్‌ ఆరోపిస్తోంది.

ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకి
లష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్‌ హోటల్‌, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, నరిమన్‌ హౌస్‌ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్‌ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.

భారత్‌, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్‌లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్‌ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.

విద్వేష వ్యాఖ్యలపై వివాదం
తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్‌ హనీఫ్‌.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.

అసలు ఎవరి హస్తం?
లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్‌ హనీఫ్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్‌ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement