జెన్ జీ జీవనశైలి గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్‌ను గడిపే విధానంలో యువత కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. అధిక ఖర్చులు, ఆర్థిక భద్రతపై పెరిగిన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ఆసక్తి కారణంగా సంప్రదాయ వినోదాలకు దూరమవుతోంది. బయట తిరగడం, పార్టీల కంటే పొదుపు, వ్యక్తిగత అభివృద్ధి, ప్రశాంతమైన సామాజిక కలయికలకు ప్రాధాన్యం ఇస్తూ జెన్ జీ వీకెండ్ సంస్కృతిని కొత్త దిశలో తీసుకెళ్తోంది.
ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి వస్తువు ధర పెరిగిన నేపథ్యంలో డబ్బును ఆదా చేయడానికి జెన్ జీ కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 62 శాతం మంది వీకెండ్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడం లేదని చెప్పారు. ఖర్చు చేసిన తర్వాత ఆర్థిక ‘‘ఎందుకు ఖర్చు చేశాం?’’ అనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలింగ్ సంస్థ హారిస్ పోల్ గత నెల విడుదల చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో 603 మంది జెన్ జీ యువతతో పాటు మొత్తం 4,100 మంది పెద్దలు పాల్గొన్నారు.
యువతలో కనిపిస్తున్న ఈ పొదుపు ధోరణి, ఆర్థిక, సామాజిక, శారీరక ఆరోగ్యంపై వారి ఆసక్తిని చూపుతోందని నిపుణులు చెప్పారు. "జెన్ జీ మృదువైన సామాజిక కలయికలను కోరుకుంటోంది. అవి ప్రశాంతంగా, తక్కువ ఖర్చుతో, మద్యం తప్పనిసరి కాని విధంగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఉంటాయి. సామాజిక ఆకర్షణ కేంద్రం నైట్‌క్లబ్ నుంచి వ్యాయామం, తరగతి గది, ప్రశాంత వాతావరణం వైపు మారిపోయింది" అని ఆమె తెలిపారు.
వీకెండ్‌లో బయటకు వెళ్లడం ఖర్చుకు తగిన విలువ ఇవ్వడం లేదని 68 శాతం సందర్భాల్లో జెన్ జీ అభిప్రాయపడుతోంది. ఈ ఫలితాలు చూస్తే, డబ్బు ఖర్చు చేసే నిర్ణయాల్లో లాభనష్టాలను అర్థం చేసుకునే, ఉద్దేశపూర్వక ఆర్థిక దృక్పథం ఉన్న తరం అని తెలుస్తోంది.
వీకెండ్‌లలో ఇంట్లోనే ఉండటానికి జెన్ జీ చూపుతున్న ఆసక్తి, మరింత విస్తృతమైన ఆలోచనా విధానానికి నిదర్శనమని నిపుణులు చెప్పారు. "జెన్ జీ నిర్లక్ష్యంగా ఉండటం కంటే తెలివిగా వ్యవహరిస్తోంది. వారి ప్రవర్తన చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న తీరును చూపుతోంది" అని అంటున్నారు. గత తరాల మాదిరిగా వస్తువులను కూడబెట్టడం కంటే, స్వేచ్ఛను పొందేందుకు డబ్బును ఒక సాధనంగా చూస్తున్నారని పేర్కొన్నారు.
ఒత్తిడులను తట్టుకునే తరం?
అమెరికాలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రంగాల్లో జెన్ జీ డబ్బు నిర్వహణ విధానం ఉపయోగకరంగా నిరూపితమైంది. పదవీ విరమణ దీనికి ఒక ఉదాహరణ. 2026లో వెలువడిన పలు అధ్యయనాలు, అమెరికన్లు తమ పదవీ విరమణ జీవితానికి అవసరమైనంత డబ్బు పొదుపు చేయలేదని వెల్లడించాయి.
ఆర్థిక సేవల సంస్థ ష్రోడర్స్ జూలైలో నిర్వహించిన సర్వే ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ జీవితం కోసం సగటు ఉద్యోగి $1.25 మిలియన్ అవసరమని భావిస్తున్నారు. కానీ ఉద్యోగ జీవితం ముగిసే సమయానికి సగానికి పైగా వ్యక్తుల వద్ద $500,000 కన్నా తక్కువే ఉంది.
సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్ తరాలు పొందిన పెన్షన్ వ్యవస్థ ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. పెన్షన్ రూపంలో పదవీ విరమణ ఖర్చును భరించే విధానానికి బదులుగా, అనేక సంస్థలు 401(కే) ఖాతాలకు మారాయి. వీటిలో ఉద్యోగులే డబ్బు జమ చేయాలి. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చనే నిబంధనలు కూడా ఉంటాయి. 401(కే) అంటే అమెరికాలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు పథకం.
24 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న జెన్ జీ ఉద్యోగులు ఈ పరిస్థితికి అనుగుణంగా మారిపోయారు. 2025 నవంబరులో బ్రోకరేజ్ సంస్థ వాన్‌గార్డ్ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ లక్ష్యానికి చేరువలో ఉన్న వయస్సు వర్గాల్లో వీరే ముందున్నారు. బేబీ బూమర్లను కూడా అధిగమించారు.
ఇల్లు కొనుగోలు చేయడం సగటు అమెరికన్‌కు అందని కలగా కనిపిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం, అమెరికాలో మధ్యస్థ ధర గల ఇల్లు, 20-34 ఏళ్ల వయస్సు గల వారి మధ్యస్థ జీతం కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ ధరలో ఉంది. 1990లో ఈ నిష్పత్తి 3.2 మాత్రమే.
అయినా సొంత ఇంటి కలను జెన్ జీ వదిలిపెట్టలేదు. 2025 నవంబరులో రియల్టర్.కామ్ నిర్వహించిన సర్వే ప్రకారం, 67 శాతం మంది సొంత ఇల్లు కలిగి ఉండటం "ముఖ్యమైన జీవిత లక్ష్యం" అని చెప్పారు.
వారు ఉద్దేశపూర్వక దృక్పథాన్ని అనుసరిస్తున్నారు. జీవిత ప్రారంభ దశలో ఇల్లు కొనుగోలు చేయడం కంటే వృత్తి జీవితంపై దృష్టి పెట్టి, భవిష్యత్తులో పెద్ద కొనుగోలుకు ఆర్థికంగా సిద్ధమవుతున్నారు. దాదాపు 75 శాతం మంది ముందస్తు చెల్లింపు కోసం పొదుపు ప్రారంభించారు.


