ప్రస్తుతం సమాజంలో జెన్ జీ (Gen Z) గురించి పలురకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు ఎక్కువగా సౌకర్యాలను కోరుకుంటారని, కష్టపడి పనిచేయరని, బాధ్యతలు తీసుకోరని చాలామంది భావిస్తారు. కానీ.. ఇది వాస్తవం కాదని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఎందుకో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి నేటి జెన్ జీ యువత అందరూ ఒకేలా ఉంటారని చెప్పడం సరికాదు. శ్రీధర్ వెంబు తన ''సంస్థలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతితో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె తన జీవితంలోని నిజమైన పరిస్థితిని వివరించింది. తన తల్లిదండ్రులు తీసుకున్న అప్పులను తీర్చడానికి, అలాగే తన చిన్న తమ్ముళ్లు, చెల్లెళ్ల భవిష్యత్తు కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని చెప్పింది. తన కుటుంబం సంతోషంగా ఉండటమే.. తన జీవితంలో ముఖ్యమైన లక్ష్యమని ఆమె తెలిపిందని'' ఆయన పేర్కొన్నారు.
కుటుంబ క్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ యువతి.. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుగా జీవిస్తోంది. ఖరీదైన దుస్తులు కొనకుండా.. తక్కువ ధరలో దొరికేవే కొనుగోలు చేస్తోంది. తెగిపోయిన చెప్పులను కుట్టించుకుని మళ్లీ వాటినే ఉపయోగిస్తోంది. ప్రతి రూపాయిని.. భవిష్యత్తు కోసం ఆదా చేస్తోంది. ఆమె మాటలు విని తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.
I come across a large number of people of various age groups, and I don't find categorizing generations based on age all that meaningful.
A 19 year old employee told me last week that she works hard to earn money so that her parents can repay their loans and support her younger…— Sridhar Vembu (@svembu) August 3, 2026
ఈ సంఘటనను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వేలాది మంది స్పందించారు. ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. తమ సంస్థలో ఇటీవల వివాహం చేసుకున్న ఇద్దరు యువ ఉద్యోగులు, తన సూచన మేరకు ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇది యువతలో ఇంకా మంచి విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలు ఉన్నాయని చూపిస్తుందని పేర్కొన్నారు.
ఈ పోస్టుకు అనేక రకాల స్పందనలు వచ్చాయి. కొందరు యువతను ప్రోత్సహించిన శ్రీధర్ వెంబును ప్రశంసించారు. మరికొందరు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల వల్లే చాలా మంది యువత చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడటం, క్రమశిక్షణ, మంచి నడవడిక చాలా అవసరమని వ్యాఖ్యానించారు.


