ఇన్వెస్టర్లూ.. ఇదిగో ఈ ఫండ్‌ చూశారా? | Bandhan Large Mid Cap Fund Review SIP Returns Portfolio Risk | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లూ.. ఇదిగో ఈ ఫండ్‌ చూశారా?

Aug 3 2026 4:08 PM | Updated on Aug 3 2026 4:19 PM

Bandhan Large Mid Cap Fund Review SIP Returns Portfolio Risk

లార్జ్‌క్యాప్‌ల స్థిరత్వంతో పాటు మిడ్‌క్యాప్‌ల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ‘లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌’ ఫండ్లు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ విభాగంలో ‘బంధన్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌’ దీర్ఘకాలిక రాబడులు, వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో ప్రత్యేకతను చాటుతోంది. లార్జ్, మిడ్‌క్యాప్‌లతో పాటు ఎంపిక చేసిన స్మాల్‌క్యాప్‌ షేర్ల ద్వారా అదనపు వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్‌ మూడు, అయిదు, ఏడు, పదేళ్ల కాలంలో కేటగిరీ సగటు, బెంచ్‌మార్క్‌ కంటే మెరుగైన ఎస్‌ఐపీ రాబడులను నమోదు చేసింది.

పెట్టుబడి వ్యూహం 
సెబీ నిబంధనల ప్రకారం లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్లు కనీసం 35 శాతం చొప్పున లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాతిపదికన బంధన్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను అధిక వృద్ధి సామర్థ్యం, నాణ్యమైన కంపెనీలు (54%), థీమాటిక్‌–సైక్లికల్‌ అవకాశాలు (31%), వాల్యూ ఆధారిత పెట్టుబడులు (11%) అనే మూడు విభాగాలుగా నిర్మిస్తోంది.  లార్జ్, మిడ్‌క్యాప్‌లతో పాటు ఎంపిక చేసిన స్మాల్‌క్యాప్‌ షేర్లలో పెట్టుబడుల ద్వారా బెంచ్‌మార్క్‌ కంటే అదనపు రాబడులను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్‌ పరిస్థితులు, వాల్యుయేషన్లు, వ్యాపార సైకిళ్లకు అనుగుణంగా రంగాలు, షేర్ల కేటాయింపులను ఎప్పటికప్పుడు మార్చుకోవడం దీని ప్రత్యేకత.

రిస్క్‌ విశ్లేషణ 
గత ఐదేళ్లలో మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా పెరగడంతో ఫండ్‌ మరింత వృద్ధి ఆధారితంగా మారింది. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చు. గత దశాబ్దంలో ఈ ఫండ్‌ రెండుసార్లు 18–19 శాతం, ఒకసారి దాదాపు 40 శాతం మేర క్షీణించింది. అందువల్ల 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితితో ఎస్‌ఐపీ మార్గంలో పెట్టుబడి పెట్టడం సముచితం.

ఎవరికి అనుకూలం  
కనీసం 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితి ఉన్న ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్‌ఐపీ ద్వారా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది మెరుగైన ఎంపిక. అయితే, మిడ్, స్మాల్‌క్యాప్‌ కేటాయింపులు అధికంగా ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి కొనసాగించడం శ్రేయస్కరం. అలాగే, ఈ ఫండ్‌ను ఒక్క ఈక్విటీ ఫండ్‌పైనే ఆధారపడకుండా, లార్జ్‌క్యాప్‌ లేదా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌తో కలిపి పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంచుకుంటే రిస్క్‌ బ్యాలెన్స్‌ అవుతుంది.  

పోర్ట్‌ఫోలియో కేటాయింపులు
జూన్‌ 2026 నాటికి ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్‌లకు 38.5%, మిడ్‌క్యాప్‌లకు 35.6%, స్మాల్‌క్యాప్‌లకు 21.4% కేటాయింపులు ఉన్నాయి. మిగిలిన 4.5% నగదు, ఇతర ఈక్విటీయేతర ఆస్తుల్లో ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్‌ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా ఉండటం పోర్ట్‌ఫోలియోలో వృద్ధి ఆధారిత ధోరణిని సూచిస్తోంది. టాప్‌–10 హోల్డింగ్స్‌ వాటా 26.7 శాతానికే పరిమితం కావడం కొన్ని షేర్లపై అధికంగా ఆధారపడకుండా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా ఉంచుతోంది.

రాబడుల పనితీరు  
దీర్ఘకాలిక ఎస్‌ఐపీ రాబడుల్లో ఈ ఫండ్‌ మూడు, ఐదు, ఏడు, పదేళ్ల కాలాల్లోనూ కేటగిరీ సగటు, బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. 
రోలింగ్‌ రాబడులు: గత ఏడేళ్ల ఎన్‌ఏవీ చరిత్ర ఆధారంగా లెక్కించిన రోలింగ్‌ రాబడుల్లోనూ ఈ ఫండ్‌ నిలకడైన పనితీరును ప్రదర్శించింది. మూడేళ్లు, ఐదేళ్ల రోలింగ్‌ రాబడుల్లో కనిష్ట, సగటు, గరిష్ట మూడు ప్రమాణాల్లోనూ బెంచ్‌మార్క్‌ను అధిగమించడం దీర్ఘకాలిక పనితీరుకు నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement