ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ఇక్కా ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఉన్నవాడికైనా, లేనివాడికైనా, ఎవ్వరికైనా సరే ఉండేది స్వార్థం. ఈ సమాజంలో జరుగుతున్న వంద శాతం నేరాలు స్వార్థంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ‘ఇక్కా’. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్థం. పేకాటలో ఆసుకు ఎంత యుక్తీ శక్తీ ఉందో అంతకంటే వందల రెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తాయనడంలో సందేహం లేదు.
ఇంకా చెప్పాలంటే ‘ఇక్కా’ సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో చూద్దాం... ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరి వేయబడి సోమా మిట్టల్ అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్‌ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తారు. కానీ న్యాయానికి కట్టుబడిన అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు.
అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల శౌర్యమాన్ తరపున కేసును వాదించడానికి అర్జున్ మెహరా ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడిన అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసుని ఎలా ఆడతాడో ‘ఇక్కా’ సినిమాలోనే చూడాలి.
ఈ సినిమా ఓ మంచి డ్రమెటిక్ థ్రిల్లర్. అల్తియా కౌశల్ అందించిన ‘ఇక్కా’ కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించారు. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, దియా మీర్జా ఈ సినిమాలోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ‘ఇక్కా’.
– హరికృష్ణ ఇంటూరు


