నందకిషోర్, విశ్వదేవ్, అరుణ్‌దేవ్
‘‘2018లో ఒక ఆలోచనతో మొదలైన ‘35 – చిన్న కథ కాదు’ ఇక్కడివరకూ (జాతీయ అవార్డులని ఉద్దేశించి) వచ్చింది. అప్పట్నుంచి ఈ 2026 వరకూ పడిన కష్టం, ఆ కష్టాలను దాటుకుని వచ్చిన అనుభవం... ఇదంతా ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా ప్రచురించడం కూడా చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నందకిషోర్ ఈమని అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, మాస్టర్ అరుణ్‌దేవ్ పోతుల తదితరులు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘35 – చిన్న కథ కాదు’.
నందకిశోర్ ఈమని దర్శకత్వంలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు (అరుణ్‌దేవ్ పోతుల) విభాగాల్లో రెండు అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘ముందుగా ఈ సినిమాని సపోర్ట్ చేసిన సురేష్‌బాబుగారికి, స్పిరిట్ మీడియాకు ధన్యవాదాలు.
ఈ సినిమాలో ప్రసాద్ పాత్రలో నేను చెప్పిన ‘చిన్న కథ కాదు’ అనే ఊతపదం ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతుండటం చిన్న విషయం కాదు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు తొలి సహాయ దర్శకుడిగా పని చేయడం ఆనందాన్నిచ్చింది. చిన్న ఆలోచనగా మొదలైన ఈ కథను నందు నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్లాడు’’ అని సజీవ్ అన్నారు. అతిథులుగా పాల్గొన్న దర్శకులు మల్లిక్ రామ్, విద్యాధర్, శశాంక్, అనురాగ్, వినోద్ తదితరులు... ‘‘ఈ సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బాల్యాన్ని గుర్తు చేసింది. భావోద్వేగానికి గురి చేసింది’’ అంటూ యూనిట్‌ని అభినందించారు.


