ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌ | Markets Impact of RBI Monetary Policy | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్‌

Aug 3 2026 6:20 AM | Updated on Aug 3 2026 6:20 AM

Markets Impact of RBI Monetary Policy

3–5 మధ్య పరపతి విధాన సమీక్ష 

యూఎస్, ఇరాన్‌పైనా ఇన్వెస్టర్ల దృష్టి 

చమురు, రూపాయి కదలికలూ కీలకమే 

ఈ వారం మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ

నేటి(సోమవారం) నుంచి మూడు రోజులపాటు పరపతి విధానాల సమీక్షను చేపట్టనున్న ఆర్‌బీఐతోపాటు.. పశ్చిమాసియా పరిస్థితులపైనా స్టాక్‌ మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అంతేకాకుండా చమురు ధరలు, రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన సోమవారం(3) నుంచి మూడు రోజులపాటు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన నిర్ణయాల సమీక్షకు సమావేశం కానుంది. జూన్‌లో నిర్వహించిన గత పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వరుసగా మూడోసారి యథాతథ వడ్డీ రేట్ల కొనసాగింపునకే కట్టుబడింది. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.25 శాతం వద్దే కొనసాగుతోంది. 

యూఎస్, ఇరాన్‌ వివాదాలతో చమురుధరల పెరుగుదల, నీరసిస్తున్న రూపాయి, ఆర్థిక వృద్ధిపై పడుతున్న ప్రభావం తదితర అంశాలను సమీక్షలో ఆర్‌బీఐ పరిగణించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో బుధవారం(5న) ప్రకటించనున్న పాలసీలో మరోసారి రెపో రేటును యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు. మరోపక్క జూలై నెలకు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్విసులు, కాంపోజిట్‌ పీఎంఐ తుది గణాంకాలు సైతం 5న వెల్లడికానున్నాయి.   

ఫలితాల ప్రభావం 
ఇప్పటికే ప్రారంభమైన తొలి త్రైమాసిక(ఏప్రిల్‌–జూన్‌) ఫలితాల సీజన్‌ మరింత వేడెక్కనుంది. ఈ వారం దివీస్‌ ల్యాబ్స్, ముత్తూట్‌ ఫైనాన్స్, డీఎల్‌ఎఫ్, ఎయిర్‌టెల్, పిడిలైట్, బీఎస్‌ఈ, మారికో, కమిన్స్, జీఈ టీఅండ్‌డీ, ట్రెంట్, మదర్‌సన్‌ సుమీ, బ్రిటానియా, లుపిన్, హీరో మోటో, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టైటన్, హిందాల్కో, ఏబీబీ, పీఎఫ్‌సీ, గోద్రెజ్‌ కన్జూమర్‌ తదితరాలు ఈ ఆర్థిక సంవత్సర(2026–27) క్యూ1 ఫలితాలు విడుదల చేయనున్నాయి. బ్లూచిప్‌ కంపెనీలతోపాటు, మిడ్‌క్యాప్‌ ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

యుద్ధ భయాలు 
యూఎస్, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రధానంగా ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇది దేశ దిగుమతుల బిల్లు భారాన్ని పెంచనుండటంతోపాటు.. డాలరుతో మారకంలో రూపాయినీ బలహీనపరుస్తోంది. దీంతో ఆర్‌బీఐ పాలసీతోపాటు పశ్చిమాసియా పరిస్థితులు సైతం మార్కెట్ల ట్రెండ్‌ను నిర్ణయించనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి తెలియజేశారు. మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్ట క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తుండటంతో ఈ వారం మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నట్లు భావిస్తున్నారు. 

గత వారమిలా.. 
శుక్రవారం(27–31)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ నికరంగా 2,035 పాయింట్లు(2.7 శాతం) బలపడి 78,095 వద్ద నిలిచింది. నిఫ్టీ 616 పాయింట్లు(2.6 శాతం) ఎగసి 24,384 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మరింత అధికంగా 1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి.

సాంకేతికంగా చూస్తే..
గత వారం అనూహ్యంగా జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మరింత బలపడేందుకు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. సాంకేతిక అంశాల ప్రకారం ఇండెక్సులు రెసిస్టెన్స్‌లకు దగ్గర్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నిఫ్టీ 24,500 పాయింట్లస్థాయిని అధిగమించవచ్చు. తదుపరి 24,750–800 వరకూ పుంజుకునే వీలుంది. ఒకవేళ బలహీనపడితే 24,100– 23,900 పాయిట్లను తాకవవచ్చు. 
→ సెన్సెక్స్‌ తొలుత 78,700 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ను ఎదుర్కోవచ్చు. ఆపై 80,000కు చేరే వీలుంది. ఒకవేళ నీరసిస్తే 77,000–76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ లభించే అవకాశముంది.

ఎఫ్‌పీఐల యూటర్న్‌
వరుసగా నాలుగు నెలలపాటు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఉన్నట్టుండి గత నెల(జూలై)లో కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. నికరంగా దేశీ స్టాక్స్‌లో రూ. 20,200 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఇందుకు పటిష్ట క్యూ1 ఫలితాలు, షేర్ల ఆకర్షణీయ ధరలు తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నాయి. కాగా.. అంతకుముందు జూన్‌లో రూ. 49,340 కోట్లు, మే నెలలో రూ. 32,963 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 60,847 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక మార్చిలో మరింత అధికంగా రూ. 1.17 లక్షల కోట్ల అమ్మాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026 తొలి 6 నెలల్లో రూ. 2.54 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇవి 2025లో చేపట్టిన రూ. 1.66 లక్షల కోట్ల అమ్మకాలకంటే అధికంకావడం గమనార్హం! 

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement