ఏఐ రాకతో ఇంటర్నెట్ కంపెనీల సతమతం
విలువ పెంచుకోవటానికి వ్యూహాలు మారుస్తున్న తీరు
స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌చేస్తూ డైవర్సిఫై అవుతున్నవి కొన్ని..
కొత్త కంపెనీలను కొంటూ ‘సమగ్ర వ్యవస్థ’పై కన్నేసినవి కొన్ని...
పెట్టుబడులతో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లుగా ఇంకొన్ని
వచ్చే పదేళ్లలో సమూలంగా మారనున్న ‘ఇంటర్నెట్ ఎకానమీ’
బీమా కావాలా...? పాలసీ బజార్‌లో చూడు!
ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు!
మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా!
ఇంటి సంగతో... హౌసింగ్.కామ్‌కు వెళ్లు!
సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్‌సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్‌లో రూ.కోటికి త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్‌నో, చాట్‌జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్‌సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...
కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్‌లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్‌లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
పీబీ ఫిన్‌టెక్ (పాలసీ బజార్)
బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్‌ఎల్‌ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్‌ఫామ్‌లో ఏఐ ఓ అసిస్టెంట్‌గా మారగలదు.
అందుకే పాలసీలను పోల్చే వెబ్‌సైట్‌లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పీబీ ఫిన్‌టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్‌లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్‌ఫామ్‌పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు.
ఇన్ఫో ఎడ్జ్
నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్‌సాథీ వంటి వెబ్‌సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్‌కు పీబీ ఫిన్‌టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్‌లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్‌ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్‌కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే.
మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్‌లో కేవలం జాబ్ పోర్టల్‌గా మిగిలిపోకుండా రెజ్యుమ్‌లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్‌మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్‌ఫామ్‌గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్‌లో కూడా ప్రాపర్టీ సెర్చ్‌లో ఏఐ హోమ్ అడ్వయిజర్‌ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.
ఆరమ్ ప్రాప్‌టెక్
2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్‌తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది.
కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్‌కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్‌కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.
ఇండియా మార్ట్
ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్‌సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం.
ఒక పంప్‌కోసం ఇండియా మార్ట్‌లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్‌లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్స్›్టను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్‌ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కలి్పంచే ఇన్‌ఫ్రా సంస్థగా మారొచ్చు.
జస్ట్ డయల్
లోకల్ సెర్చ్‌కు అడ్రస్‌గా నిలిచిన జస్ట్ డయల్‌కు అర్బన్‌కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్‌కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్‌లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్‌మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్‌ఫామ్‌గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం.
కార్‌ట్రేడ్
సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్‌ట్రేడ్‌కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్‌వాలే, బైక్‌వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్‌ట్రేడ్... కేవలం లిస్టింగ్‌లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్‌లు, రుణాలు, బీమా, ఓనర్‌షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్‌ఫామ్‌గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈజీ ట్రిప్
ఆన్‌లైన్ ట్రావెల్‌లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్‌జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్‌ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్‌ను ఈ ఆన్‌లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్‌చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్‌పీరియన్స్‌లు అందించే సంస్థలే ఆన్‌లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు.
ఏఐని తట్టుకోగలిగేవేంటి?
కేవలం సెర్చ్‌తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్‌ప్లేస్‌లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్‌కు విలువ పెరిగింది.
ఇండియా మార్ట్, పీబీ ఫిన్‌టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి...
→ ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా?
→ ఈ డేటా నిరంతరం అప్‌డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా?
→ ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా?
→ ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్‌్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్‌ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్‌ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.
భవిష్యత్ విజేతలెవరు...?
వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్‌పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు. పాలసీ బజార్ ఫిన్‌టెక్, ఆరమ్ ప్రాప్‌టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్‌ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. 
సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్‌నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్‌లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్‌లు, లావాదేవీల ప్యాటర్న్‌లు, సప్లయర్ రేటింగ్‌లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టరి్మనాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్‌లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్‌పేజ్‌లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్‌జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే
అవకాశాలూ ఉంటాయి.
(రమణమూర్తి మంథా)


