అమెరికాలోని బార్డ్ కాలేజ్‌లో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి భారతీయ అమెరికన్ జర్నలిస్ట్, రచయిత ఫరీద్ జకారియా చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం
విశ్వ గురు
మీరు కేవలం ఒక కాలేజీ నుంచి పట్టా పొందడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్యమంలో భాగమై బయటకు అడుగుపెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ రోజుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన రెండు అక్షరాలు పలకబోతున్నాను: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). 2026లో అత్యంత వివాదాస్పదమైన అంశం జాతి, లింగం లేదా వలస పాలన కాదు. ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అవుతుందని ఎవరు ఊహించారు? కానీ నేను నిజానికి ఏఐ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది హెచ్‌ఐ (హ్యుమన్ ఇంటెలిజెన్స్– మానవ మేధస్సు) గురించి. కృత్రిమ మేధ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. దాని శక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఏఐ శక్తి ఎంత పెరిగినా, మనుషులు అవసరం లేనివారిగా మారిపోరు.
మనిషి మాత్రమే చేయగలిగేది?
ప్రతి తరం ప్రపంచాన్ని మార్చేసే కొత్త సాంకేతిక విప్లవా లను చూసింది. ముద్రణ యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చింది. విద్యుత్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మరోవైపు భయాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద మార్పును తీసుకొస్తున్న సాంకేతికతగా ఏఐ మన ముందుకు వచ్చింది.
ఇది వ్యాసాలు రాయగలదు. సంగీతాన్ని సృష్టించగలదు. వ్యాధు లను గుర్తించగలదు. క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించ గలదు. వీడియోలను రూపొందించగలదు. మనుషుల్లా మాట్లాడగలదు. అందుకే చాలామంది ఒక ప్రశ్న అడుగు తున్నారు: ‘ఇక మనుషులకు మిగిలేది ఏమిటి?’ కానీ బహుశా ఇది తప్పు ప్రశ్న కావచ్చు. అసలు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏఐ రావడం వల్ల మనుషుల ప్రత్యేకత ఏమిటో మనకు ఏం అర్థమవుతోంది? మనిషిగా ఉండటం అంటే ఏమిటి? మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? అనే విషయాన్నిమరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు లభించింది.
మనుషులు మాత్రమే చేయగలిగే, యంత్రాలు ఎప్పటికీ చేయలేనివి ఏమిటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన భవిష్యత్తుకు ఎంతో విలువైనది. ముందుగా మనిషి మెదడు గురించి ఆలోచించండి. అది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. మనిషి మెదడు బరువు సుమారు ఒకటిన్నర కిలోలే. అది పనిచేయడానికి కేవలం ఇరవై వాట్ల శక్తి సరిపోతుంది. అయితే ప్రపంచంలోని అత్యాధునిక ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే, కోట్లాది వాట్ల విద్యుత్‌ను వినియోగించే భారీ డేటా సెంటర్లు అవసరం. ఆ విద్యుత్‌తో మొత్తం ఒక నగరాన్నే నడప వచ్చు. అదే సమయంలో మీ తలలో ఉన్న మెదడు ఒక ల్యాప్‌టాప్ ఛార్జర్ కంటే తక్కువ శక్తితో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది.
ఒక చిన్న పిల్లవాడు మసక వెలుతురులో కూడా ఒక ముఖాన్ని వెంటనే గుర్తుపట్టగలడు. గొంతులోని భావాన్ని అర్థం చేసుకోగలడు. వ్యంగ్యం, సందిగ్ధత, ఆప్యాయత, సిగ్గు, ప్రేమ, హాస్యం, బాధ వంటి భావాలను మనం చాలా సహజంగా అర్థం చేసుకుంటాం. ఒక గదిలోకి వెళ్లగానే అక్కడి వాతావరణాన్ని గ్రహిస్తాం. నిశ్శబ్దంలో కూడా ఉద్రిక్తతను గుర్తిస్తాం. చిరునవ్వు లోని కృత్రిమతను కూడా కనిపెట్టగలుగుతాం. యంత్రాలు విశ్లే షణలో గొప్పవే. కానీ మనుషులు కేవలం విశ్లేషణ చేసే జీవులు కాదు. మనం ఇతర మనుషులతో కలిసి జీవించే సామాజిక జీవులం. ఒక యంత్రం బాధతో కూడిన కవిత రాయగలదు. కానీ అది అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకోలేదు. ప్రేమలేఖ రాయగలదు. కానీ ప్రేమలో పడలేదు. భయం గురించి వివరించగలదు. కానీ అర్ధరాత్రి మేల్కొని తన జీవితాన్ని వృథా చేసుకున్నానేమో అని ఆందోళన చెందలేదు. ఇదే మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
అసంపూర్ణతే అందం
జపాన్ లో ‘వాబి–సాబి’ అనే గొప్ప తత్వం ఉంది. అది అసంపూర్ణతను కీర్తిస్తుంది. అక్కడ చేతితో తయారైన మట్టి పాత్రలు కొద్దిగా వంకరగా ఉండొచ్చు. రంగు సమానంగా లేకపోవచ్చు. అయినా వాటికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందు కంటే, వాటిలో ఒక మనిషి స్పర్శ కనిపిస్తుంది. కొన్నిసార్లు విరిగిపోయిన పాత్రలను బంగారు మిశ్రమంతో అతికిస్తారు. దానిని ‘కింట్సుగి‘ అంటారు. ఆ పగుళ్లను దాచిపెట్టరు. వాటినే అందంగా చూపిస్తారు.
ఎందుకంటే, ఆ పగుళ్లు కూడా ఆ పాత్ర జీవితంలో ఒక భాగమే. మనిషి జీవితమూ అంతే. మన గాయాలు, మన వైఫల్యాలు, వాటి నుంచి కోలుకున్న తీరు... ఇవే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. యంత్రాలు వేలాది దుస్తు లను ఒకే విధంగా తయారు చేయగలవు. అయినా ప్రపంచంలో అత్యంత ఖరీదైన దుస్తులు ఇప్పటికీ చేతితో కుట్టినవే. ఎందుకంటే, వాటిలో యంత్రాల పరిపూర్ణత కాదు, మనిషి నైపుణ్యం కనిపిస్తుంది. మనుషులు ఎప్పుడూ పరిపూర్ణతనే వెతకరు. చాలాసార్లు నిజాయితీని వెతుకుతారు. ఆత్మను వెతుకుతారు.
ఏఐ యుగంలో అసలు ప్రమాదం యంత్రాలు మనుషుల్లా మారడంలో లేదు. మనుషులే యంత్రాల్లా మారాలని ప్రయ త్నించడంలో ఉంది. ఇప్పటికే మనం దానిని చూస్తున్నాం. ప్రతి విషయాన్నీ ‘ఆప్టిమైజ్‘ చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిద్ర, ఉత్పాదకత, పరిచయాలు, పనితీరు. ప్రతి దాన్నీ సంఖ్యలతో కొలవాలనుకుంటున్నాం. విద్యార్థులు తమ జీవితాన్ని ఒక పరి పూర్ణ బయోడేటాగా మార్చుకోవాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులు అలసట తెలియని అల్గారిథమ్‌లతో తమను తాము పోల్చుకుంటూ భయపడుతున్నారు. కానీ మానవ జీవితం పరిపూర్ణత వల్ల కాదు. మానవత్వం వల్ల గొప్పదవుతుంది.
మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే వారు ఎప్పుడూ అత్యంత సమర్థులే కావాల్సిన అవసరం లేదు. వారు అత్యంత మానవత్వం కలిగినవారు. మీపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఒక ఉపాధ్యాయుడు, బాధలో మీతో పాటుగంటల తరబడి కూర్చున్న ఒక స్నేహితుడు, మీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, ప్రాణాలకు ముప్పు వచ్చినా తన ఆశయాన్ని వదలని ఒక సామాజిక కార్యకర్త... ఇలాంటి వారే మన జీవితాలను మార్చుతారు.
ఏఐతో లోపం లేని ఒక అద్భుతమైన సంగీతాన్ని రూపొందించవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంగీత కృతుల్లో ఒకటైన తొమ్మిదో సింఫనీని బీథోవెన్ దాదాపు పూర్తిగా చెవిటి వాడైన తర్వాత స్వరపరిచాడు. ఆ సంగీతాన్ని విన్నప్పుడు మనల్ని కదిలించేది కేవలం స్వరాల అందం కాదు. తాను ఎప్పటికీ వినలేని సంగీతాన్ని సృష్టించాలనే ఒక మనిషి సంకల్పం, అతని బాధ, అతని పట్టుదల. అందుకే మానవ మేధస్సు ఎంతో విలువైనది. దానిలో చైతన్యం ఉంది. భావో ద్వేగాలు ఉన్నాయి. జీవిత అనుభవాలు ఉన్నాయి.
మానవత్వమే ముఖ్యం
ఏఐ వైద్యం, విజ్ఞానం, విద్య, రవాణా, పరిశ్రమలు దాదాపు ప్రతి రంగాన్నీ మార్చబోతోంది. కొన్ని ఉద్యోగాలు మారిపోతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పూర్తి పరిశ్రమలే రూపాంతరం చెందుతాయి. కానీ ఈ మార్పులన్నింటి మధ్య కూడా, మనుషులు కోరుకునేది మాత్రం మనుషులనే. తమ పిల్లలకు బోధించడానికి, అనారోగ్యంలో ధైర్యం చెప్పడానికి, సంక్షోభ సమయంలో నాయకత్వం వహించడానికి, మనిషి జీవితాన్ని ప్రతిబింబించే కళను సృష్టించడానికి... ఇంకా ముఖ్యంగా... ఒకరికి ఒకరు విలువైన వారిగా ఉండడానికి మనుషులే అవసరం. మానవ జీవితం సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
నా కోరిక ఒక్కటే. మీరు ఏఐతో పోటీ పడకండి. దాని బలాలను అనుకరించకండి. దానికి బదులుగా మరింత మంచి మనుషులుగా మారండి. నైపుణ్యాన్ని మాత్రమే కాదు, వివేకాన్ని పెంచుకోండి. సమాజంతో కలిసి జీవించడం నేర్చుకోండి. నమ్మకాన్ని సంపాదించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే... చివరికి మనం అత్యంత విలువైనదిగా భావించేది, లోపాలు లేని తెలివితేటలను కాదు. లోపాలున్నా ప్రేమించగల మానవత్వాన్ని. అవును... వ్యాధులను నయం చేయడానికి, విజ్ఞానాన్ని విస్తరించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్పాదక తను పెంచడానికి... ఇప్పటివరకు అసాధ్యంగా భావించిన సమ స్యలను పరిష్కరించడానికి... ఏఐని తప్పకుండా ఉపయోగించండి. అదే సమయంలో... మనిషి మెదడు ఎంత అద్భుతమో ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఏఐని ఉపయోగించండి.


