జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్‌’ అన్న నబీన్‌కు ఓటుతో బదులు | Bankipur Bypoll Gen Z Anger CJP Protests Bring Down BJP Stronghold | Sakshi
Sakshi News home page

జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్‌’ అన్న నబీన్‌కు ఓటుతో బదులు

Aug 3 2026 5:58 PM | Updated on Aug 3 2026 6:15 PM

Bankipur Bypoll Gen Z Anger CJP Protests Bring Down BJP Stronghold

బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ విజయ దుందుభి మోగించారు. బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజక వర్గంలో మరో పార్టీ గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. జన్ సూరజ్ పార్టీకి ఇది తొలి అసెంబ్లీ విజయం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్నారు ప్రశాంత్ కిశోర్. బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో కేవలం 30 రోజుల పాటు శ్రమించి (ఎన్నికల ప్రచారం చేసి) ఆయన గెలుపొందారు.  

బీజేపీ ఓటమి వెనుక పలు ముఖ్యమైన అంశాలున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల నిర్వహించిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో బంకీపూర్ ఉప ఎన్నిక ఫ‌లితంపై చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను జెన్‌ జీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇచ్చిన ఝ‌ల‌క్‌గా అభివర్ణిస్తున్నారు.

4 సార్లు ఇక్కడే నబీన్‌ గెలుపు
రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన స్వయంగా వదులుకున్న సొంత నియోజకవర్గం బంకీపూర్‌లోనే బీజేపీ ఓటమి చెందింది. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్‌ నబీన్‌ గెలిచారు. అలాగే, 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎప్పుడూ కోల్పోలేదు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు ఓడించారు.

సీజేపీని వైరస్‌తో పోల్చిన నబీన్‌
నితిన్ నబీన్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ దానిని "వైరస్‌"తో పోల్చారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. "దేశంలో వైరస్‌, కాక్రోచ్‌లాంటి పార్టీలు వస్తున్నాయి. ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరచాలని చూస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుక్డే-టుక్డే గ్యాంగ్‌లో ఇవి భాగం" అని అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. "మమ్మల్ని టెర్రరిస్టులు, వైరస్‌ అని పిలుస్తున్నారు. కానీ మేము విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం" అని చెప్పారు.

జెన్‌ జీ ఎఫెక్ట్‌- సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో చీలిక
బంకీపూర్‌లో బీజేపీ ఓటమి జెన్ జీ ఎఫెక్టే అంటూ నెటిజ‌న్ల కామెంట్లు చేస్తున్నారు. యువ ఓటర్ల తీర్పుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి జెన్‌ జీ ఉద్యమం ప్రభావం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఎన్నికల ఫలితంపై స్పష్టంగా కనిపించింది. జెన్‌ జీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు. 

ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణల అంశాలను యువత బలంగా ప్రస్తావించింది. కాక్రోచ్‌ ఉద్యమంలో బిహార్‌ యువత కూడా పాల్గొన్నారు. జెన్‌ జీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ యువ ఓటర్లను చైతన్యపరిచింది. మొదటిసారి ఓటు వేసిన యువతలో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రతిపక్షాలకు మద్దతుగా డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. జెన్‌ జీ ఉద్యమం స్థానిక సమస్యలను ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చింది. దీంతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌లోనూ కొంత మేర చీలిక ఏర్పడినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫలితం యువత రాజకీయ ప్రభావాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement