తాడేపల్లి : తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన సీదిరి అప్పలరాజు, ముస్తఫాపై కూడా ఇలాగే దాడులు చేయించారని మండిపడ్డారు టీజేఆర్.
ఈరోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. బీసీ, ఎస్సీలపై చంద్రబాబు దురుద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ‘ నాగరాజు తన భార్య నైటీని చించి, మాపార్టీ నేతలపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. మంత్రులు పార్థసారధి, సంధ్యారాణి సిగ్గు లేకుండా మాపై ఆరోపణలు చేశారు. అధికార మదం తలకెక్కిన మాటలను మంత్రులు మాట్లాడుతున్నారు.
లోకేష్ చేసిన డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయటానికే ఈ కుట్రలకు తెర తీశారు. తన కొడుకు కనపడటం లేదని కోర్టుకు వెళ్లిన మాల గంగమ్మను పోలీసులు కొట్టి చంపారు. చివరికి పోలీసుల పహరాలోనే ఆమె శవాన్ని దహనం చేయించారు. మా నిజ నిర్ధారణ కమిటీ గ్రామానికి వెళ్తే మమ్మల్ని వారి ఇంటికి కూడా వెళ్లనీయలేదు. గంగమ్మ మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టాలి.
తప్పుడు కేసుల పెట్టి వేధిస్తున్న ఏ పోలీసులనూ వదలం. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై పోలీసులు అరాచకం చేశారు. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యాపారిపై ముస్తఫా ఫిర్యాదు చేస్తే ఆయనపైనే కేసు పెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు బెదిరింపులపై ఫిర్యాదు చేసిన మాదాలా శ్రీనివాస్ పైనే తిరిగి కేసు పెట్టారు. ఆముదాలవలస ఇంఛార్జి చింతాడ రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారు.
ఎస్ఐ మీద అసభ్యకరంగా ప్రవర్తించింది పోలీసులే. ఆ పోలీసులను వదిలేసి, చింతాడ రవి మీద ఎలా కేసు పెడతారు?, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా అధికారిని వేధిస్తే ఎందుకు కేసు పెట్టలేదు?, ఆ మహిళా అధికారి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?, మహిళా ఎస్ఐ కేసులో ధనేటి రమ్మోహనరావు, తేజేశ్వర్రావు ఇద్దరూ స్థానికంగా లేకపోయినా కేసు పెట్టారు. ఎన్.సురేష్ అనే డాక్యుమెంట్ రైటర్ పైన కూడా అలాగే కేసు పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులతో రాష్ట్రం పరువు తీస్తున్నారు
నీట్ పేపర్ లీకైనందున కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే మరి లోకేష్ ఏం చేస్తున్నారు?, డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహించరా?, ఎమ్మెల్యే విరూపాక్షిని బేషరతుగా విడుదల చేయాలి. సీసీ కెమెరా హార్డ్ డిస్కులను భద్రపరచాలి. చింతాడ రవికుమార్ కేసులో అక్కడ లేని వారిపై కేసులను ఉపసంహరించుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


