కాచన సాయిచేతన (ఫైల్)
‘బ్రహ్మపుత్ర’లో గల్లంతైన ఐఐటీ విద్యార్థిని మృతి
మృతురాలు జమ్మలమడుగు తహశీల్దార్ కుమార్తె సాయి చేతన
సాక్షి, జమ్మలమడుగు: అసోంలోని బ్రహ్మపుత్ర వరద ఉధృతికి గల్లంతైన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తహశీల్దార్ కాచన వెంకటసాయినాథ్ రెడ్డి కుమార్తె కాచన సాయిచేతన (20) మృతి చెందారు. ఆమె ఐఐటీ గువాహటి(అసోం)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళాశాల సమీపంలో ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర నదిలో వరద నీటిని చూసేందుకు ఆమె స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి గల్లంతైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి సాయినాథ్ రెడ్డి వెంటనే గువాహటికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె స్వస్థలమైన పెద్దముడియం మండలంలోని ఎన్.కొట్టాలపల్లి గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సాయిచేతన తల్లి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వెంకటసాయినాథ్ రెడ్డికి ఆమె ఏకైక కుమార్తె.


