మేం అడిగింది రూ. 50 వేలు కాదు.. రూ. 5 వేలే | YSR Kadapa: Three Police Constables Allegedly Extort Money from Brothel | Sakshi
Sakshi News home page

మేం అడిగింది రూ. 50 వేలు కాదు.. రూ. 5 వేలే

Aug 3 2026 12:09 PM | Updated on Aug 3 2026 12:26 PM

Three Constables Incident In YSR Kadapa District

వ్యభిచార గృహంలోని మహిళలను బెదిరించి పలువురు కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేశారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు శివారులోని బైపాస్‌రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు డయల్‌ 100కు ఆ ప్రాంతవాసులు ఫోన్‌ చేశారు. 

దీంతో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు, స్టేషన్‌ ఇన్‌చార్జితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనా స్థలానికి వెళ్లే సరికి తిరుపతికి చెందిన మహిళలతో పాటు కొందరు విటులు ఉన్నారు. వారి ఆధార్‌ కార్డులు ఇవ్వండి.. స్టేషన్‌కు పదండి అంటూ కానిస్టేబుళ్లు హడావుడి చేశారు. సార్‌ తిరుపతి నుంచి ఇక్కడికి పొట్టకూటి కోసం వచ్చాం.. దయచేసి వదలి పెట్టండి వెళ్లిపోతాం.. అంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. 

అయితే అందుకు కానిస్టేబుళ్లు మాత్రం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కొంత డబ్బు ఇస్తే వదలి పెడతామంటూ వారిలో ఓ కానిస్టేబుల్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. తమ వద్ద క్యాష్‌ లేదని, ఫోన్‌పే నంబర్‌ చెబితే డబ్బు పంపిస్తామని మహిళలు చెప్పారు. దీంతో వారిలోని ఓ కానిస్టేబుల్‌ తనకు తెలిసిన వ్యక్తి ఫోన్‌ పే నంబర్‌ ఇచ్చాడు. మహిళలు ఆ నంబర్‌కు రూ. 50 వేలు పంపినట్లు సమాచారం. డబ్బులు అందడంతో కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వచ్చేశారు.  

మేం అడిగింది రూ. 50 వేలు కాదు.. రూ. 5 వేలే 
ఇప్పుడు పోలీసు శాఖలో ఎక్కడ చూసినా వ్యభిచార గృహం– ముగ్గురు కానిస్టేబుళ్ల వార్త గురించే చర్చ జరుగుతోంది.. ఈ వార్త బయటికి రావడంతో కానిస్టేబుళ్లు ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో వారు కొత్త పల్లవిని అందుకున్నారు. మేం అడిగింది రూ. 50 వేలు కాదని.. రూ. 5 వేలే అని సమర్ధించుకునే పనిలో పడ్డారు. అంతేగాక తమకు డబ్బు పంపిన ఫోన్‌ పే నంబర్‌కు రూ.50 వేలను రిటన్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆ నంబర్‌ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. 

ఈ క్రమంలోనే ఈ విషయం పోలీసు అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్టేషన్‌ అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆ కానిస్టేబుళ్లపై అంతర్గత విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. వ్యభిచార వృత్తిలో పట్టుబడ్డ మహిళల నుంచి కానిస్టేబుల్లు డబ్బు తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

ప్రొద్దుటూరు క్రైం : 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement