సార్‌.. మీ హెల్మెట్‌ ఏది? | Police Riding Bike Without Helmet In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సార్‌.. మీ హెల్మెట్‌ ఏది?

Aug 3 2026 7:49 AM | Updated on Aug 3 2026 12:53 PM

Police Riding Bike Without Helmet In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: ట్రాఫి క్‌ రూల్స్‌.. సామాన్యులకేనా? పోలీసులకు వర్తించవా? ఫైన్లు వేసేటప్పుడు ఉండే శ్రద్ధ.. వారు రూల్స్‌ పాటించడంలో ఎందుకు ఉండదు? ఇది రోడ్లమీద తరచూ వినిపించే సామాన్యుల ఆవేదన. కానీ.. ఓ యువకుడు ఏకంగా రోడ్డుపై వెళ్తున్న పోలీసులనే ‘మీ హెల్మెట్‌ ఏది సార్‌? అంటూ ధైర్యంగా నిలదీశాడు. అయితే.. ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నగరంలోని శ్రీహరిపురం సమీపంలో జరిగిన సంఘటన ఇది. 


అసలేం జరిగిందంటే..! 
శ్రీహరిపురం అన్నమ్మ కాలనీ దాటుతూ.. హెచ్‌పీసీఎల్‌ వైపుగా రాత్రి సమయంలో ఇద్దరు పోలీసులు ఓ స్కూటర్‌పై వెళ్తున్నారు. బండి నడుపుతున్న పోలీసుతో పాటు, వెనుక కూర్చున్న పోలీసుకి కూడా హెల్మెట్‌ లేదు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వారి పక్కకు వచ్చి.. ‘సార్‌.. మీ హెల్మెట్‌ ఏది సార్‌?’ అని ప్రశ్నించాడు. ఇంతలో డ్రైవ్‌ చేస్తున్న పోలీస్‌.. ‘మేము నైట్‌ బీట్‌లో ఉన్నాం’ అని బదులివ్వగా.. ఆ యువకుడు ఏమాత్రం తగ్గలేదు. ‘మాకు మాత్రం హెల్మెట్‌ లేకపోతే.. రూ.10వేలు ఫైన్‌ వేసేస్తారు. మీరు మాత్రం హెల్మెట్‌ పెట్టుకోరా?’ అంటూ నిలదీశాడు. 

ఇంకోసారి ఇలా జరగదు..!: సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సామాన్యులు ప్రశ్నిస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. లేదా అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంటారు. కానీ.. ఇక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. యువకుడి ప్రశ్నతో బండి వెనుక కూర్చున్న పోలీసు వెంటనే బండి ఆపమన్నారు. కిందకు దిగి.. ఆ యువకుడు అడిగిన దాంట్లో న్యాయం ఉందని మనస్ఫూర్తిగా అంగీకరించారు. ‘నువ్వు అన్నది వాస్తవమే.. కరెక్టే.. మేం హెల్మెట్‌ పెట్టుకుని వెళ్లాలి. మాది తప్పే కాదనడం లేదు. క్వశ్చన్‌ చేయడం నీ తప్పు కాదు.. అది నీ రైట్‌. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసుతో సమానమే’ అంటూ తన తప్పును అంగీకరించారు.

 ‘సేఫ్టీ రూల్‌ అనేది అందరికీ ఒకటే కదా’ అంటూ ఆ యువకుడు చెప్పిన మాటకు ఆ అధికారి సానుకూలంగా స్పందించి.. రైట్‌..ఈసారి అలా జరగదు అంటూ బదులిచ్చిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చట్టం, ట్రాఫిక్‌ నిబంధనలు ఎవరికైనా ఒకటేనని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. తప్పు చేసినప్పుడు సాక్షాత్తూ పోలీసులైనా సరే భయపడకుండా ప్రశ్నించిన యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. అదే సమయంలో.. ఎదురుగా ఉన్నది సామాన్యుడే కదా అని బెదిరింపులకు దిగకుండా.. చట్టం ముందు అందరూ సమానులే అని అంగీకరించి తప్పు ఒప్పుకున్న పోలీసుల తీరును కూడా ప్రశంసిస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement