వరద ముంపులో కోనసీమ లంక గ్రామాలు
మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
పది మండలాల్లోని 19 గ్రామాలకు వరద తాకిడి
ఎగువన వరద తగ్గడంతో కాస్త ఉపశమనం
సాక్షి, అమలాపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టినా.. దిగువన కోనసీమలో మాత్రం నీరు చేరుతోంది. జిల్లాలోని పది మండలాల్లో సుమారు 19 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. రహదారులు, కాజ్‌వేలు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.
వరద ముంపులోనే...
» పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, అల్లవరం, కాట్రేనికోన, కె.గంగవరం మండలాల్లోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలను ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరింది.
» పి.గన్నవరం మండలంలో జి.పెదపూడిలంక, బూరుగులంక, ఉడిముడిలంక, అరిగెలవారిపేట, కె.ఏనుగుపల్లి, జొన్నలంక, శివాయిలంక, పల్లెపాలెం ప్రాంతాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి ముంపులో ఉన్నాయి.
» ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేల్లంక శివారు పల్లెపాలెం, గురజాపులంక, చింతపల్లి లంకలను వరద చుట్టుముట్టింది. గురజాపులంక రోడ్డు పూర్తిగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి.
» అయినవిల్లి మండలం ఎదురుబిడియం, పి.గన్నవరంలో గంటి పెదపూడి కాజ్‌వేలు మునిగిపోవడంతో ప్రజల రాకపోకల కోసం పడవలను ఏర్పాటు చేసుకున్నారు.
» వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలను ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
» ముమ్మిడివరం లంకాఫ్ ఠాన్నేల్లంక మత్స్యకార కాలనీ, అల్లవరం బోడసుకుర్రు పల్లిపాలెం, కోటిపల్లి గ్రామాల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరింది.
తగ్గుముఖం పట్టిన గోదావరి ఉధృతి
ధవళేశ్వరం: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారానికి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీæ వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు 14.60 అడుగులకు నీటిమట్టం చేరింది. 14,11,474 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువన నీటిమట్టాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం రాత్రికి ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించే అవకాశం ఉంది. గోదావరి డెల్టా కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇందులో తూర్పు డెల్టాకు 4,400, మధ్య డెల్టాకు 1,000, పశ్చిమ డెల్టాకు 3,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ భద్రాచలంలో 42.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో ప్రమాద హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.88 మీటర్లు, పేరూరులో 14.25 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.25 మీటర్లు, కూనవరంలో 20.42 మీటర్లు, కుంటలో 11.59 మీటర్లు, పోలవరంలో 13.10 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 16.94 మీటర్ల వద్ద నీటి మట్టాలు నెలకొన్నాయి.


