ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి
లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ
ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక
ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు
ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి
ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో వరుసగా చర్చలు జరిపిన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల పేరుతో ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ ‘ మా సహనాన్ని పరీక్షించవద్దు. ఉద్యోగుల ఆర్థిక, సేవాపరమైన సమస్యలపై ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలి. అప్పటికీ స్పందన లేకపోతే విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి అదే వారంలో రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. జూలై 10, 11 తేదీల్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో ఆర్థిక, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రులు చర్చలు జరిపారు.
అనంతరం జూలై 22న అన్ని ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి చర్చలు జరిపింది. అయినప్పటికీ ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు, స్నేహపూర్వకంగా ఉంటామన్న భరోసాకు ప్రస్తుత ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది’ అని విమర్శించారు. ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ పి దామోదరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు తదితరులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు
ప్రధాన డిమాండ్లు ఇవీ...
» ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.50 వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి ఉద్యోగికి లక్షల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉంది. పనిచేసిన కాలానికి చట్టబద్ధంగా రావాల్సిన మా సొమ్మునే మేము అడుగుతున్నాం.
» ప్రతి ఆరు నెలలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలను రెండేళ్లుగా ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
» ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ 11వ పీఆర్సీ అమలులోనే కొనసాగుతున్నాం. దీనివల్ల ఉద్యోగులు ఇప్పటికే మూడు పీఆర్సీలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు.
» 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి.
» ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మూడేళ్లుగా ఐఆర్ ఇస్తున్నా ఏపీలో మాత్రం అది ఇవ్వకపోవడం అన్యాయం.
» విశ్రాంత ఉద్యోగులకు గతంలో అమల్లో ఉన్న 70, 75 ఏళ్ల వయసులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలి. పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.
» ఉద్యోగుల హెల్త్ కార్డును ఎనిమిది వారాల్లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి.
» రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరించాలి.


