అత్యధికంగా వినియోగించే ఐదు ప్రొసీజర్‌లు
ఎత్తేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు
సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, మూడు ఆప్తమాలజీ ప్రొసీజర్‌లు ప్రైవేట్‌లో కట్
ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వైద్య శాఖ
తద్వారా లబ్ధిదారులపై ఏటా రూ.500 కోట్ల భారం
పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసేలా కుతంత్రం
పేద మహిళలకు ప్రసవ వైద్యాన్ని దూరం చేయడం ద్వారా అదనపు భారం
ఇప్పటికే ఆరోగ్య ఆసరా ఎత్తేసి రెండేళ్లలో బాలింతలకు రూ.300 కోట్ల మేర నష్టం చేసిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు ఆపద్భాందవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే వెంటిలేటర్ ఎక్కించడమే కాక క్రమంగా కనుమరుగు చేసే కుట్రలు పన్నుతోంది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పటికే పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేసింది.
మరోవైపు ఈ పథకం కింద చికిత్సలను ఎత్తేసే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా ఈ పథకం కింద ఎక్కువ మంది వినియోగించుకునే ప్రొసీజర్లను ఎత్తేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ పరంపరలో సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కంటి సమస్యలకు సంబంధించిన మూడు ప్రొసీజర్లను ఎత్తేసి.. పేద, మధ్య తరగతి ప్రజలపై ఏటా రూ.500 కోట్లకుపైగా భారాన్ని మోపడానికి రంగం చేస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్‌లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్‌లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్‌ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్‌లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రొసీజర్‌లను కుదించాలని కొద్ది నెలలుగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ప్రయత్నాల్లో భాగంగా సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు మూడు ఆప్తమాలజీ ప్రొసీజర్‌లను ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎత్తేయడం కోసం వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2019–24 మధ్య రాష్ట్రంలో ఏటా 3 లక్షల మేర ప్రసవాలు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదయ్యాయి. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద దాదాపు 2.50 లక్షల మంది వృద్ధులకు కేటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. ఇప్పుడీ ప్రొసీజర్‌లను ప్రైవేట్‌లో పూర్తిగా ఎత్తేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్లకు పైగా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది.
ఆసరా ఎత్తేసి ఇప్పటికే వెన్నుపోటు
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు అందించిన రూ.5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని ఇప్పటికే ఎత్తేశారు. తద్వారా మహిళలకు మరో వెన్నుపోటు పొడిచారు. ఒక్క ఆసరా రూపంలో గత రెండేళ్లలో పేద, మధ్య తరగతి మహిళలు రూ.300 కోట్ల మేర నష్టపోయారు. ఇక్కడితో ఆగకుండా గర్భం దాల్చిన మహిళలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత కాన్పు సేవలు లేకుండా బాబు సర్కార్ అడుగులు వేస్తుండటం వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా 3,257 ప్రొసీజర్‌లు ఏపీలోని ఆరోగ్యశ్రీ పథకంలోనే ఉన్నాయని, ఇన్ని అవసరం లేదని ఇటీవలే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తేల్చి పడేశారు. ఈ క్రమంలో వీటి సంఖ్యను కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎం జేఏవై)లోని 1,949కి కుదించాలని 2024లోనే వైద్య శాఖ కమిటీలు వేసి కసరత్తు చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రతిఘటించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మరో రూపంలో ప్రొసీజర్‌లను తగ్గించే ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను అప్పుల ఊబిలోకి
స్పెషల్ ఫ్లైట్‌లు, హెలికాప్టర్‌లలో తిరుగుళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటపాటలు, యోగా డే వంటి ఈవెంట్స్, విలాసాలకు ప్రత్యేక బడ్జెట్‌లు కేటాయించి మరి చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. ఇదిలా ఉండగా కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లింపులకు నిధుల్లేమి సాకుతో బాబు సర్కార్ అప్పుల బాట పట్టింది. రాష్ట్ర చరిత్రలో గతమెన్నడూ లేనట్టుగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చి ఇటీవల అరకొరగా బిల్లులు విడుదల చేసింది. ఈ అప్పునకు అయ్యే వడ్డీ కూడా ఆస్పత్రులె చెల్లించాలని బిల్లుల్లో 8 శాతం మేర కోత పెట్టడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
నాడు సంస్కరణలతో ఊపిరి
2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్య ఎక్కింది. నాటి టీడీపీ ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోయింది. ఈ బకాయిలు చెల్లిస్తూ, కోవిడ్ వంటి ప్రపంచ విపత్తును అధిగమిస్తూనే వైఎస్ జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. రూ. ఐదు లక్షల వరకు వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో వెయ్యి కొత్త ప్రొసీజర్‌లతో 2020 జనవరి నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రారంభించారు. దీంతో ఏడాది తిరగకుండానే 1,059 ప్రొసీజర్‌లను 2059కి పెంచారు.
ఇలా 2019–24 మధ్య 3,257కు తీసుకొచ్చారు. 2014–19 మధ్య బాలు పాలనలో రూ.5,177 కోట్లు పథకం కోసం ఖర్చు చేయగా, 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఏకంగా రూ.13 వేల కోట్లపైనే వెచ్చించారు. మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో కొత్త జబ్బులు అనేకం పుట్టుకొస్తున్న క్రమంలో ఇంకా ఈ పథకం కిందకు రాని జబ్బులుంటే వాటిని గుర్తించి పథకంలో చేర్చాల్సిందిపోయి.. చంద్రబాబు సర్కార్ ఏకంగా ఉన్న ప్రొసీజర్‌లనే ఎత్తేస్తూ పేదల ఆరోగ్య భరోసాకు గండికొట్టే ప్రయత్నం చేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.



