ఇప్పటికే రాష్ట్రంలో మలేరియాతో ఏడుగురు మృతి
పలు జిల్లాలలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు
వ్యాధుల కట్టడిలో చేష్టలుడిగిన చంద్రబాబు సర్కారు
ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపించని వ్యాధి నిర్ధారణ కిట్లు
డాక్టర్ల సలహాలతో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న బాధితులు
డెంగీ ర్యాపిడ్ పరీక్షకు రూ. 500 నుంచి రూ.700 వరకు వసూలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్స్‌లోనే వ్యాధి నిర్ధారణ
నేడు అందుకు భిన్నమైన పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, వ్యాధుల కట్టడికి, బాధితులకు తక్షణ వైద్యం అందించడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలం అవుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ ప్రాథమిక నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు లేవు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రులకు కిట్‌ల సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
కనిపించని వ్యాధి నిర్ధారణ కిట్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లోని విలేజ్ క్లినిక్స్‌లో డెంగీ, కోవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణకు అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న బాధితులకు గ్రామాల్లోనే వ్యాధి నిర్ధారణ ప్రాథమికంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. విలేజ్ క్లినిక్స్‌లోనే కాదు, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లోను డెంగీ కిట్‌లు లేని దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల డెంగీ అనుమానిత లక్షణాలతో వచ్చిన రోగులకు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) పరీక్ష చేసి ఆ ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇక చాలా చోట్ల కిట్‌లు లేవని, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహాకులు డెంగీ ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు.
పెరుగుతున్న డెంగీ జ్వర బాధితులు..
వైద్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డెంగీ జ్వరాల విజృంభణ గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి తొలి 25 వారాల్లో 835 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 932కు పెరిగింది. విశాఖ, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లాలో గత ఏడాది 94 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 85 కేసులు రికార్డు అయ్యాయి.
చిత్తూరు జిల్లాలో గత ఏడాది తొలి 25 వారాల్లో 43 కేసులు వెలుగు చూడగా, ఈ ఏడాది అదే కాలానికి 65 కేసులు బయటపడ్డాయి. ఇక వైద్య శాఖ లెక్కల్లోకి రాని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. సీజనల్ వ్యాధులను సున్నాకు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను వైద్య శాఖ తగ్గిస్తోందని ఆ శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఏడుగురు మృతి....
గిరిజన, మైదాన ప్రాంతాల్లోను మలేరియా జ్వరాల విజృంభణ అధికంగా ఉంటోంది. ఇప్పటికే మలేరియా బారినపడి సరైన వైద్య సేవలు అందక అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, పాడేరులలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గత ఏడాది తొలి 25 వారాల్లో ఇద్దరు మరణించగా, ఈ ఏడాది అదే సమయానికి ఏడుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసులు తగ్గినట్టు వైద్య శాఖ లెక్కలు చూపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఏఎస్‌ఆర్, పోలవరం, మన్యం వంటి గిరిజన జిల్లాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ప్రతి ఇంట్లో మంచం పట్టిన జ్వర బాధితులు ఉంటూనే ఉన్నారు.


