‘ఆత్మ’ సాక్షిగా.. క్రెడిట్‌ చోరీ కుట్రలు | Netizens on social media are furious over Eenadu lies | Sakshi
Sakshi News home page

‘ఆత్మ’ సాక్షిగా.. క్రెడిట్‌ చోరీ కుట్రలు

Aug 3 2026 3:24 AM | Updated on Aug 3 2026 3:24 AM

Netizens on social media are furious over Eenadu lies

‘భోగాపురం’.. బాబు ఖాతాలో వేయబోయి మరోసారి అడ్డంగా దొరికిపోయిన ‘ఈనాడు’

మూడేళ్ల క్రితం చనిపోయిన రైతునూ వదలని ఎల్లో మీడియా 

ఎయిర్‌పోర్టు ప్రారంబోత్సవం తిలకించి రైతు ఉప్పొంగిపోయారంటూ ఫేక్‌ కథనం

ఈనాడు అబద్ధాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్ల మండిపాటు

నాడు పట్టాభి విషయంలోనూ ఈనాడు అదే తీరు

సాక్షి ప్రతినిధి, విజయవాడ/పూసపాటిరేగ: : నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక.. అంటూ నమ్మబలికే ఈనాడు తన నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకుంది! చంద్రబాబు సర్కారుకు భజంత్రీలు వాయించడం, తప్పుడు కథనాలను ప్రచురించడం, పాఠకుల కళ్లకు గంతలు కట్టడం, తిమ్మిని బమ్మి చేయడంలో తనకు సాటి లేదని మరోసారి రుజువు చేసుకుంది! భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో వేసేందుకు తహతహలాడుతూ ‘ఆత్మ’సాక్షిగా దొరికిపోవడం దీనికి పరాకాష్ట! మూడేళ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారంటూ ఈనాడు ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురించిన కథనం సర్వత్రా కలకలం రేపుతోంది. 

చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి యల్లాజీ అనే రైతు ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చారని, నేడు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారని ఈనాడు మైక్‌ ముందుకొచ్చి చెప్పినట్లు కథనాన్ని అచ్చోసింది. నిజం ఏమిటంటే.. మైలపల్లి యల్లాజీ 2023 జూలైలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు లోకం మాధవి స్వయంగా యల్లాజీ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. అదే విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలోనూ పోస్ట్‌ చేశారు. 

మూడేళ్ల క్రితం కన్నుమూసిన వ్యక్తి.. మళ్లీ తిరిగి వచ్చి ఈనాడు ప్రతినిధితో మాట్లాడారని తప్పుడు కథనాలు రాయడం పాఠకులను, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమేనని సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈనాడు వండి వార్చే అబద్ధాలకు ఇదో మచ్చు తునక అని సోషల్‌ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు బరి తెగింపు సర్వత్రా చర్చనీయాంశం కావడంతో నాలుక కరుచుకుని ఆదివారం అర్ధరాత్రి హడావుడిగా నెట్‌ ఎడిషన్‌లో ఆ ఫోటో మాత్రమే తొలగించి మరో ఫోటోను చేర్చడం కొసమెరుపు.  

పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు ప్రచురించి 
ఇక వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఈనాడు నిత్యం విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. నాడు టీడీపీ నేత పట్టాభిని కస్టడీలో పోలీసులు కొట్టారంటూ, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ పాత ఫోటోలను ప్రచురించి ఈనాడు నమ్మించే యత్నం చేసింది. పట్టాభిని కొట్టారంటూ 2023 ఫిబ్రవరి 22న ఈనాడు ఒక బ్యానర్‌ కథనాన్ని ప్రచురించింది. అయితే అందులో 2021 నాటి ఘటన ఫోటోలను ఈనాడు ప్రచురించింది. 

ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, అవి పాత ఫొటోలని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వం ఆధారాలను బయటపెట్టడంతో ఈనాడు దుర్భుద్ధి బహిర్గతమైంది. దీంతో గత్యంతరం లేక తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ, చింతిస్తున్నట్లు ఈనాడు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. పట్టాభిని కొట్టారంటూ తొలుత ఈనాడు కథనం వెలువరించగానే కనీసం నిర్ధారించుకోకుండానే వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ ఆ వార్తను ట్వీట్‌ చేయడం గమనార్హం. 

పట్టాభిని కొట్టారంటూ కోర్టులో న్యాయమూర్తులకు కూడా ఆ ఫోటోలు చూపించారు. అనంతరం వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి గాయాలు లేవని, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు. దీంతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ఇప్పుడు కూడా అదే రీతిలో బురద చల్లేందుకు యత్నించి మరోసారి దొరికిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement