ఓట్లు తగ్గాయి.. బూత్‌లు పెరిగాయ్‌ | Increase of 3931 polling stations in the state | Sakshi
Sakshi News home page

ఓట్లు తగ్గాయి.. బూత్‌లు పెరిగాయ్‌

Aug 3 2026 3:37 AM | Updated on Aug 3 2026 3:37 AM

Increase of 3931 polling stations in the state

‘సర్‌’ తర్వాత రాష్ట్రంలో 3,931 పోలింగ్‌ స్టేషన్ల పెరుగుదల

46,397 నుంచి 50,328కి చేరిన పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 

గరిష్టంగా 1,200 మంది ఓటర్లతో పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ 

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన ఓట్లు 44.89 లక్షలు 

సాక్షి, అమరావతి:  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోగా పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. సాధారణంగా ఓటర్ల సంఖ్య తగ్గితే పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య తగ్గాలి. కానీ దానికి భిన్నంగా 44.89 లక్షల ఓట్లు తగ్గితే.. 3,931 అదనపు పోలింగ్‌ స్టేషన్లు వచ్చి చేరా­యి. సర్‌కు ముందు రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లకు గాను 46,397 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. 

ఇంటింటి సర్వే తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 44,89,562 తగ్గి  3,71,38,132కి చేరినట్టు ముసాయిదా జాబితాలో ప్ర­కటించారు. అయితే ఇదే సమయంలో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 46,397 నుంచి 50,328కి పెరిగింది. గతంలో కొన్ని పోలింగ్‌ స్టేషన్ల ప­రిధిలో 1,400కిపైగా ఓటర్లు ఉండగా ‘సర్‌’ అనంతరం అది 1,2­0­0 దాటకూడదన్న నిబంధన పెట్టడంతో ఆ మేరకు రేషనలైజేషన్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఓటర్ల సంఖ్య తగ్గినా పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య మరో 3,931 పెరిగినట్లు వివరించారు.

రెట్టింపైన బీఎల్‌ఏల సంఖ్య
రాష్ట్రవ్యాప్తంగా సర్‌ ప్రక్రియలో రాజకీయ పార్టీలు చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. సర్‌ కార్యక్రమం మొదలు కాకముందు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) సంఖ్య 68,868 కాగా అది ఇప్పుడు 1,27,868కి చేరిందన్నారు. అత్యధికంగా వైఎస్సార్‌ సీపీ నుంచి 45,973 మంది బీఎల్‌ఏలు ఉండగా టీడీపీ నుంచి 44,603 మంది ఉన్నారు. బీజేపీ నుంచి 27,583, జనసేన నుంచి 8,988, సీపీఎం నుంచి 364, కాంగ్రెస్‌ నుంచి 356, బీఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement