టాటా.. బైబై! | Another huge project moved out of the state | Sakshi
Sakshi News home page

టాటా.. బైబై!

Aug 3 2026 4:08 AM | Updated on Aug 3 2026 4:08 AM

Another huge project moved out of the state

రాష్ట్రం నుంచి తరలిపోయిన మరో భారీ ప్రాజెక్టు

ఒడిశాకు రూ.6,675 కోట్ల టాటాపవర్‌ ఇంగాట్, వేఫర్‌ తయారీ కేంద్రం 

భూములిచ్చినా.. రాయితీలు కుమ్మరించినా వద్దనుకున్న కంపెనీ 

ఏపీ కన్నా తక్కువ రాయితీలిచ్చినా ఒడిశానే బెటరనుకుంది... 

ఒడిశాలో విద్యుత్‌ చౌక.. మౌలికవసతులు బాగున్నాయి.. 

ఏపీ కంటే ఒడిశానే బాగుంది.. టాటా పవర్‌ సీఈవో పర్వీర్‌ సిన్హా వ్యాఖ్య 

జీవోలు కూడా ఇచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఆరో కంపెనీ ‘టాటా’

ఇప్పటికే హిందుస్థాన్‌ కోకోకోలా, అజాద్‌ మొబిలీటీ, జ్యూపిటర్, జిన్‌ఫ్రా, ఐస్పేస్‌ గుడ్‌బై.. 

రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ రూ.12,890 కోట్లు 

రెండేళ్లలో వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లే 

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ 

రూ.లక్షల కోట్ల పెట్టుబడులంటూ బాబు అండ్‌ కో ప్రచారం డొల్లే..

సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో భారీ ప్రాజెక్టు పారిపోయింది. మీ రాయితీలు.. మీ భూ కేటాయింపులకో దండమంటూ పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. ఇలా చేసింది ఏదో చిన్నా చితకా సంస్థ కాదు. భారతదేశ కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూపునకు చెందిన కంపెనీ. టాటా గ్రూప్‌ కంపెనీ ఇలా చేసిందంటే రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ, అన్యాయమైన పాలన ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరు వద్ద సోలార్‌ విద్యుత్‌ తయారీకి ఉపయోగించే 10 గిగావాట్ల ఇంగాట్, వేఫర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి టైలర్‌మేడ్‌ రాయితీలను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వదిలేసింది. మరీ విచిత్రమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ కంటే తక్కువ రాయితీలు ఇస్తున్నా సరేనంటూ ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనినిబట్టి రాష్ట్రంలో ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ కంటే  ‘ఈజ్‌ ఆఫ్‌ లూటింగ్‌ బిజినెస్‌’ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

                   టాటా గ్రూప్‌ కంపెనీకి రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో 

ఏపీ కంటే ఒడిశాయే బెటర్‌ 
ఇరు రాష్ట్రాలు ప్రకటించిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులకు ఏపీ కంటే ఒడిశా రాష్ట్రమే అత్యుత్తమైనదంటూ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా టాటా పవర్‌ సీఈవో పర్వీర్‌ సిన్హా ప్రకటించారు. పెట్టిన పెట్టుబడిలో దాదాపు 69 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కింద  38.4 శాతం ఇస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. 

కానీ ఇప్పుడు ఒడిశా రాష్ట్రం 30 శాతం మాత్రమే ఇస్తానంది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ఇరు రాష్ట్రాలు 100 శాతం మినహాయింపు ఇచ్చాయి. ఇవికాకుండా ఈ యూనిట్‌కు అవసరమైన మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తానని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా ఇన్ని రాయితీలను ప్రకటించినా కూడా వీటిని కాదనుకుని ఒడిశాకు వెళ్లిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కార్పొరేట్‌ సంస్థలను భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఒడిశాలో వెంటనే యూనిట్‌ను ప్రారంభించడానికి అనువైన వాతావరణం ఉందని, అన్నిరకాల మౌలిక వసతులు ఉండటంతో అక్కడ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామని జీవో ఇచ్చిన 9 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందంటే రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్‌ విండో, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రచారంలోని డొల్లతనం మరోసారి ప్రపంచానికి తెలిసింది. 2024లో జరిగిన 14వ ఎస్‌ఐపీబీలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించగా..  2025 జనవరి10న రాయితీలు, 250 ఎకరాలు భూమి కేటాయింపులు చేస్తూ జీవో 11ను ప్రభుత్వం జారీ చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కనీస భూ సేకరణ చేయకపోవడం, కంపెనీ ప్రతిపాదనలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ తీరుకు విసుగెత్తి టాటా పవర్‌ పరారైందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

జీవోలు ఇచ్చాక రూ.12,890 కోట్ల పెట్టుబడులు పరార్‌ 
ఒక కంపెనీ పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ), ఆ తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ఎస్‌ఐపీబీకి వస్తాయి. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఆ నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇలా ఇన్ని దశలు దాటుకుని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు లాగిపెట్టి కొట్టి మీ రాష్ట్రానికో దండమంటూ వెనక్కి వెళ్లిపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. 

చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత టాటా పవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరు కంపెనీలు భూములు కేటాయించిన తర్వాత కూడా జీవోలను ముఖం మీద విసిరికొట్టి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం, కొనసాగుతున్న అరాచక పాలన  దెబ్బకి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి రూ.12,890 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ మధ్యనే లోక్‌సభలో కేంద్ర వాణిజ్య శాఖ గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన వాస్తవ పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అంటే ఈ రెండేళ్లలో రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు కంటే వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ దాదాపు రెట్టింపుగా ఉండటం గమనార్హం. 

రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు 
కోకో కోలా గుడ్‌బై 
అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద రూ.1,200 కోట్లతో 6.65 కేఎల్‌పీఏ సామర్థ్యంతో శీతల పానీయాల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి హిందుస్థాన్‌ కోకో కోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అనేక రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నేతల కప్పాలకు భయపడిన ఈ కంపెనీ తన పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు వెళ్లిపోయింది. తమకు కేటాయించిన 50.04 ఎకరాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరుమీద భూ సమీకరణ చేయొద్దంటూ కోకో కోలా కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో 2 ఏడాది ఫిబ్రవరి 27న భూ కేటాయింపులను రద్దుచేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు.  

ఆగిపోయిన ‘ఆజాద్‌ మొబిలిటీ’ 
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు తొలి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,046 కోట్ల పెట్టుబడి 2,381 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆజాద్‌ మొబిలిటీ ఈ పెట్టుబడి ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో ఆ కంపెనీకి కేటాయించిన భూములను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

చాపచుట్టేసిన ఐస్పేస్‌ 
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఐస్పేస్‌ టెక్నాలజీస్‌ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహారాలతో 6 నెలల్లోనే చాపచుట్టేసింది. హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్‌ టెక్నాలజీస్‌ విశాఖçలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి కల్పించేలా ఐటీ క్యాంపస్‌ నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 2025 నవంబర్‌ 7న దీనికి ఆమోదముద్ర వేసి ఏపీ ఐటీ అండ్‌ జీసీసీ పాలసీ కింద పలు రాయితీలు ప్రకటించింది. 

ఈ క్యాంపస్‌ కోసం మధురవాడ రుషికొండ హిల్‌ నంబర్‌–2లో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రెండెకరాలను కేటాయిస్తూ 2025 నవంబర్‌ 12న జీవో–58 విడుదల చేసింది. భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి 90 రోజులు దాటినా భూమి విలువ చెల్లించకపోవడంతో ఆ రెండెకెరాలను రద్దు చేస్తూ ఆ భూమిని ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌కు కేటాయిస్తూ గత జూన్‌ లో మరో జీవో విడుదలైంది

జిన్‌ఫ్రా కూడా పరారీ 
కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలను జిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ 2025 జూన్‌ 27న ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వమే తిరిగి రద్దు చేసింది. కేటాయించిన భూమికి నగదు చెల్లించకపోవడంతో కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌లో ఉపయోగించే బైమాడ్యులర్‌ చార్జ్‌ సిస్టమ్స్‌తో పాటు ట్రిపుల్‌ బేస్‌ ప్రొపెల్లెంట్, సింగిల్‌ బేస్‌ ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. 

ఈ ప్రతిపాదనకు 7వ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్‌ 27 ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడి వెనక్కి వెళ్లిపోయింది. భూమి కేటాయించి 8 నెలలైనా ఒక్క రూపాయి కూడా కట్టకుండా చివరకు తమకు కేటాయించిన భూములను రద్దు చేయమంటూ జిన్‌ఫ్రా లేఖ రాయడంతో భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

పారిపోయిన జూపిటర్‌ 
అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్‌ రెన్యువబుల్స్‌ సంస్థ రూ.2,700 కోట్లతో 2,216 మందికి ఉపాధి కల్పించే విధంగా వచ్చిన ప్రతిపాదనకు 6వ ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోదం తెలి­పింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ మాడ్యూల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం 142 ఎకరాలను కేటాయిస్తూ జీవో–85ను 2025 మే 23న ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కేటాయించిన ఏడాదిలోనే ఆ భూములు మాకొద్దు ఈ భూములకు ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు తమ పేరు మీద ఉన్న భూ కేటాయింపులను రద్దు చేయాల్సిందిగా కోరింది. దీంతో జూపిటర్‌కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement