breaking news
Mega project
-
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
టాటా.. బైబై!
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో భారీ ప్రాజెక్టు పారిపోయింది. మీ రాయితీలు.. మీ భూ కేటాయింపులకో దండమంటూ పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. ఇలా చేసింది ఏదో చిన్నా చితకా సంస్థ కాదు. భారతదేశ కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూపునకు చెందిన కంపెనీ. టాటా గ్రూప్ కంపెనీ ఇలా చేసిందంటే రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ, అన్యాయమైన పాలన ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.6,675 కోట్ల పెట్టుబడితో నెల్లూరు వద్ద సోలార్ విద్యుత్ తయారీకి ఉపయోగించే 10 గిగావాట్ల ఇంగాట్, వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి టైలర్‌మేడ్ రాయితీలను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసింది. మరీ విచిత్రమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రాయితీలు ఇస్తున్నా సరేనంటూ ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనినిబట్టి రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కంటే ‘ఈజ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ కంపెనీకి రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో ఏపీ కంటే ఒడిశాయే బెటర్ ఇరు రాష్ట్రాలు ప్రకటించిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులకు ఏపీ కంటే ఒడిశా రాష్ట్రమే అత్యుత్తమైనదంటూ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా టాటా పవర్ సీఈవో పర్వీర్ సిన్హా ప్రకటించారు. పెట్టిన పెట్టుబడిలో దాదాపు 69 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 38.4 శాతం ఇస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒడిశా రాష్ట్రం 30 శాతం మాత్రమే ఇస్తానంది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ఇరు రాష్ట్రాలు 100 శాతం మినహాయింపు ఇచ్చాయి. ఇవికాకుండా ఈ యూనిట్‌కు అవసరమైన మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తానని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా ఇన్ని రాయితీలను ప్రకటించినా కూడా వీటిని కాదనుకుని ఒడిశాకు వెళ్లిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కార్పొరేట్ సంస్థలను భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒడిశాలో వెంటనే యూనిట్‌ను ప్రారంభించడానికి అనువైన వాతావరణం ఉందని, అన్నిరకాల మౌలిక వసతులు ఉండటంతో అక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని జీవో ఇచ్చిన 9 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందంటే రాష్ట్రంలో అమలవుతున్న సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రచారంలోని డొల్లతనం మరోసారి ప్రపంచానికి తెలిసింది. 2024లో జరిగిన 14వ ఎస్ఐపీబీలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించగా.. 2025 జనవరి10న రాయితీలు, 250 ఎకరాలు భూమి కేటాయింపులు చేస్తూ జీవో 11ను ప్రభుత్వం జారీ చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కనీస భూ సేకరణ చేయకపోవడం, కంపెనీ ప్రతిపాదనలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ తీరుకు విసుగెత్తి టాటా పవర్ పరారైందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీవోలు ఇచ్చాక రూ.12,890 కోట్ల పెట్టుబడులు పరార్ ఒక కంపెనీ పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ), ఆ తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ఎస్‌ఐపీబీకి వస్తాయి. ఎస్ఐపీబీ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఆ నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇలా ఇన్ని దశలు దాటుకుని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు లాగిపెట్టి కొట్టి మీ రాష్ట్రానికో దండమంటూ వెనక్కి వెళ్లిపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత టాటా పవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరు కంపెనీలు భూములు కేటాయించిన తర్వాత కూడా జీవోలను ముఖం మీద విసిరికొట్టి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం, కొనసాగుతున్న అరాచక పాలన దెబ్బకి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి రూ.12,890 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ మధ్యనే లోక్‌సభలో కేంద్ర వాణిజ్య శాఖ గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన వాస్తవ పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అంటే ఈ రెండేళ్లలో రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు కంటే వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ దాదాపు రెట్టింపుగా ఉండటం గమనార్హం. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు కోకో కోలా గుడ్‌బై అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద రూ.1,200 కోట్లతో 6.65 కేఎల్పీఏ సామర్థ్యంతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి హిందుస్థాన్ కోకో కోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అనేక రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నేతల కప్పాలకు భయపడిన ఈ కంపెనీ తన పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు వెళ్లిపోయింది. తమకు కేటాయించిన 50.04 ఎకరాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరుమీద భూ సమీకరణ చేయొద్దంటూ కోకో కోలా కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో 2 ఏడాది ఫిబ్రవరి 27న భూ కేటాయింపులను రద్దుచేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆగిపోయిన ‘ఆజాద్ మొబిలిటీ’ శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు తొలి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,046 కోట్ల పెట్టుబడి 2,381 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ ఈ పెట్టుబడి ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో ఆ కంపెనీకి కేటాయించిన భూములను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాపచుట్టేసిన ఐస్పేస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఐస్పేస్ టెక్నాలజీస్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహారాలతో 6 నెలల్లోనే చాపచుట్టేసింది. హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖçలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి కల్పించేలా ఐటీ క్యాంపస్ నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 2025 నవంబర్ 7న దీనికి ఆమోదముద్ర వేసి ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద పలు రాయితీలు ప్రకటించింది. ఈ క్యాంపస్ కోసం మధురవాడ రుషికొండ హిల్ నంబర్–2లో ఎకరం రూ.4 కోట్ల చొప్పున రెండెకరాలను కేటాయిస్తూ 2025 నవంబర్ 12న జీవో–58 విడుదల చేసింది. భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి 90 రోజులు దాటినా భూమి విలువ చెల్లించకపోవడంతో ఆ రెండెకెరాలను రద్దు చేస్తూ ఆ భూమిని ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్‌కు కేటాయిస్తూ గత జూన్ లో మరో జీవో విడుదలైందిజిన్ఫ్రా కూడా పరారీ కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోనే ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలను జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వమే తిరిగి రద్దు చేసింది. కేటాయించిన భూమికి నగదు చెల్లించకపోవడంతో కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్‌లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్‌తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెల్లెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనకు 7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27 ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి భయపడి వెనక్కి వెళ్లిపోయింది. భూమి కేటాయించి 8 నెలలైనా ఒక్క రూపాయి కూడా కట్టకుండా చివరకు తమకు కేటాయించిన భూములను రద్దు చేయమంటూ జిన్ఫ్రా లేఖ రాయడంతో భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన జూపిటర్ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ సంస్థ రూ.2,700 కోట్లతో 2,216 మందికి ఉపాధి కల్పించే విధంగా వచ్చిన ప్రతిపాదనకు 6వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం తెలిపింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 142 ఎకరాలను కేటాయిస్తూ జీవో–85ను 2025 మే 23న ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కేటాయించిన ఏడాదిలోనే ఆ భూములు మాకొద్దు ఈ భూములకు ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు తమ పేరు మీద ఉన్న భూ కేటాయింపులను రద్దు చేయాల్సిందిగా కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
ఆ సూర్యుడే దిగి వస్తే.. 582 టన్నుల ‘పవర్ హౌస్’!
సూర్యుడు ఉదయించకపోతే ఒక్క రోజు కూడా మన జీవితం ముందుకు సాగదు. కోట్ల ఏళ్లుగా భూమికి వెలుగు, వేడి, శక్తిని అందిస్తున్న ఆ సూర్యుడి రహస్యం ఏమిటో తెలుసుకుని.. అదే శక్తిని భూమిపైనే సృష్టించాలన్నది శాస్త్రవేత్తల కల. ఇప్పటివరకు అది ప్రయోగశాలలకే పరిమితమైన ఆలోచన. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేసే దిశగా చైనా మరో భారీ అడుగు వేసింది.ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మాగ్నెట్‌ను నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఇది చైనా చేపడుతున్న ‘కృత్రిమ సూర్యుడు’ (Artificial Sun) ప్రాజెక్టులో కీలక మైలురాయిగా మారింది. ఈ ఒక్క పరికరం వెనుక దాగి ఉన్న సాంకేతికత.. భవిష్యత్తులో ప్రపంచ విద్యుత్ అవసరాలనే మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.582 టన్నుల మహా అయస్కాంతం.. అంత పెద్దదెందుకు?చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ భారీ అయస్కాంతం సాధారణ పరికరం కాదు. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ ‘డి’ ఆకారంలో రూపొందించారు. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను అదుపులో ఉంచేందుకు ఈ అయస్కాంతం ఉపయోగపడుతుంది.సాధారణంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. సూర్యుడిని భూమిపై తీసుకురావడం కాదు. సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను చిన్న స్థాయిలో, నియంత్రిత పరిస్థితుల్లో పునరావృతం చేయాలన్నదే ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.అసలు ‘కృత్రిమ సూర్యుడు’ అంటే ఏమిటి?సూర్యుడి గుండెలో ప్రతి క్షణం కోట్లాది హైడ్రోజన్ అణువులు కలుస్తూ అపారమైన శక్తిని విడుదల చేస్తుంటాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇదే ప్రక్రియను భూమిపై సృష్టించి విద్యుత్‌గా మార్చగలిగితే.. దాదాపు అంతులేని స్వచ్ఛమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఫ్యూజన్ విద్యుత్‌లో బొగ్గు, చమురు వంటి ఇంధనాల మాదిరిగా భారీగా కార్బన్ ఉద్గారాలు ఉండవు. అందుకే దీనిని భవిష్యత్తు ‘క్లీన్ ఎనర్జీ’గా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.100 మిలియన్ డిగ్రీల వేడి.. ఎలా అదుపు చేస్తారు?ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. ఫ్యూజన్ రియాక్టర్లో ప్లాస్మా ఉష్ణోగ్రతలు ఏకంగా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. అంతటి వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. చైనా తయారు చేసిన ఈ భారీ మాగ్నెట్ పని కూడా అదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాల్లోనే నియంత్రిస్తూ రియాక్టర్ గోడలకు తాకకుండా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మండుతున్న అగ్నిగోళాన్ని చేతితో పట్టుకోకుండా, దూరం నుంచి అదుపు చేసే సాంకేతికత ఇది.2030 నాటికి విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంఈ ప్రయోగంతో చైనా తన ఫ్యూజన్ ప్రణాళికలో మరో ముందడుగు వేసింది. 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఆ దేశ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే EAST (Experimental Advanced Superconducting Tokamak) అనే ప్రయోగ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్నే ‘చైనా ఆర్టిఫిషియల్ సన్’ అని కూడా పిలుస్తారు. ఈ కేంద్రం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 1,066 సెకన్ల పాటు కొనసాగించి రికార్డు సృష్టించింది.అయితే ప్రమాదాలు లేవా? సవాళ్లు ఏమిటి?ఫ్యూజన్ శక్తి గురించి వింటే.. “అయితే ఇక విద్యుత్ సమస్యకు ముగిసినట్టేనా?” అనే ప్రశ్న రావచ్చు. కానీ శాస్త్రవేత్తల ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మొదటిది.. ఖర్చు. ఇలాంటి భారీ రియాక్టర్ల నిర్మాణానికి వేల కోట్ల పెట్టుబడులు అవసరం. రెండోది.. ప్లాస్మాను ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగించడం. 100 మిలియన్ డిగ్రీల వేడిని నియంత్రించడం ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన పని. మూడోది.. రియాక్టర్ పదార్థాల భద్రత. ఫ్యూజన్ ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్ల ప్రభావాన్ని తట్టుకునే కొత్త పదార్థాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.అయితే సంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే ఫ్యూజన్లో ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంధన సరఫరా ఆగిపోతే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అదుపు తప్పి భారీ అణు విపత్తుగా మారే అవకాశం చాలా తక్కువ.భవిష్యత్తు విద్యుత్‌కు కొత్త ఆశ582 టన్నుల ఈ భారీ అయస్కాంతం కేవలం ఓ యంత్ర భాగం కాదు.. మానవాళి శక్తి భవిష్యత్తుపై పెట్టుకున్న ఓ భారీ ఆశ. ఒకప్పుడు సూర్యుడి శక్తి మనకు అందని అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అదే శక్తి రహస్యాన్ని భూమిపై అర్థం చేసుకుని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయోగం వెంటనే మన ఇళ్లకు విద్యుత్ ఇవ్వకపోవచ్చు. కానీ భవిష్యత్తులో బొగ్గు, చమురు వంటి కాలుష్య ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ‘భూమిపై సృష్టించిన సూర్యుడు’ నుంచి విద్యుత్ పొందే రోజులకు ఇది వేసిన మరో పెద్ద అడుగుగా నిలవొచ్చు. -
తీరంలో మెగా ప్రాజెక్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ సముద్ర తీరంలో మెగా ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. నరసాపురం తీర ప్రాంతంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. హార్బర్ నిర్మాణానికి అనువైన స్థలం, పూర్తి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో హార్బర్ ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఖరారు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. పర్యావరణ అనుమతులతో సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని రూ.429.43 కోట్లతో హార్బర్ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే హార్బర్ నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థ దక్కించుకుంది. త్వరితగతిన ప్రక్రియ నరసాపురం నియోజకవర్గంలోని పీఎం లంక–బియ్యపుతిప్ప గ్రామాల మధ్య స్థలాన్ని ప్రభుత్వ భూమిని గుర్తించి హార్బర్‌కు కేటాయించారు. పనులకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. హార్బర్ నిర్మాణానికి ఈ ఏడాది మే నెలలో ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలవగా విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కంచుకుంది. వెంటనే ప్రాథమిక సర్వే ఆ సంస్థ చేపట్టింది. నిర్మాణానికి సంబంధించి సరుకుల రవాణా కోసం రోడ్డు మార్గాలు చూసుకోవడం, ప్రాజెక్ట్ స్వరూపంపై సర్వే చేయడం లాంటి పనులు పూర్తి చేసుకుని పనులను కొద్దిరోజుల్లో ప్రారంభించనుంది. దశాబ్దాల కల : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ ప్రాంతంలో బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ ప్రాంతంలో 10 వేల మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే మత్స్యకారుల సంక్షేమంపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో బియ్యపుతిప్ప హార్బర్ డిమాండ్ అలాగే ఉండిపోయింది. మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో ఉమ్మడి పశ్చిమకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక కొత్తగా ఏర్పడ్డ డెల్టా ప్రాంతంతో కూడిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల సాగు పెరగడంతో ఆక్వా రంగం పుంజుకుంది. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆక్వా రంగం నుంచి జిల్లాకు వస్తోంది. ఇటు తీర ప్రాంతంలో సముద్ర మత్స్యసంపద ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువ చేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. వేగంగా పనులు పూర్తిచేసేలా.. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకారులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కలను సాకారం చేశారు. హార్బర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, సాంకేతిక అనుమతులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో పనులు మొదలు పెడతారు. పనుల్లో తాత్సారం లేకుండా నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసేలా టెండర్‌దారుడితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. –ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL — Narendra Modi (@narendramodi) September 9, 2023 -
3 మెగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనల గురించి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విశాఖలో కాలుష్య రహిత గ్రీన్ పరిశ్రమల ఏర్పాటునకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పలు మెగా ప్రాజెక్టుల పెట్టుబడులకు సంబంధించి అధికారులు వెల్లడించిన వివరాలివీ.. ► చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, రెండు దశల్లో రూ.700 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన ఆ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఇంటలిజెంట్ సెజ్ లిమిటెడ్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా యూనిట్ ఏర్పాటు చేస్తుందని, అక్కడ కూడా రెండు వేల మందికి ఉపాధి లభించనుందని సీఎంకు అధికారులు వివరించారు. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, మొత్తం రూ.980 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఆ సంస్థ ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ► విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ.. రూ.14,634 కోట్లను ఆ సంస్థ పెట్టుబడి పెట్టనుండగా, మొత్తం 24,990 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. అలాగే స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనల గురించి కూడా వారు తెలిపారు. ► ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని, అదే సమయంలో సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను అధికారులు సమావేశంలో వివరించారు. ► సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
బీఆర్ఐకి వ్యతిరేకం
చింగ్‌దావ్: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్దావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం వేదికగా బీఆర్ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ దేశాలు సంతకం చేశాయి. భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్ బయల్దేరారు. అనుసంధానతే మా లక్ష్యం.. కానీ! ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్ పోర్టు అభివృద్ధి, అష్గాబట్ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్ ఎస్సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. బీఆర్ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్ అన్నారు. బీఆర్ఐ ఏంటి? ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి. అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్ఐలో చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ భావిస్తోంది. -
ప్రగతిపథంలో నడుద్దాం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు అందరూ సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ శ్రీకాంత్ కోరారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో 65వ గణతంత్రదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎగుర వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా జిల్లా ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. నాయుడుపేట, మాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్‌లో, కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా 21 మెగా ప్రాజెక్ట్‌లను నెలకొల్పనున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం రూ.1,22,733 కోట్లు వెచ్చించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే జిల్లాలో 1,35,504 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 17 మెగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించి 33,910మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. జిల్లాలో బొగ్గు ఆధారితంగా రెండు పవర్ ప్రాజెక్ట్‌లు 1870 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నాయన్నారు. అలాగే 20 వేల మెగావాట్ల సామర్థ్యంతో 16 పవర్‌ప్రాజెక్ట్‌లు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. ఏడో విడతలో 5910 ఎకరాలు భూపంపిణీ జిల్లాలో త్వరలో జరగనున్న ఏడో విడత భూపంపిణీలో 4311 మంది లబ్ధిదారులకు 5910 ఎకరాలు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు ఉన్నం దున ఈ రబీలో 2,32, 864 హెక్టార్లలో వరి, మినుము, శనగ, పొగాకు, వేరుశనగ తదితర పంటలను సాగుచేశారన్నారు. చెరువుల కింద సాగుచేసే పంటలన్నీ ఎండుముఖం పట్టాయన్నారు. అలాంటి వాటిని కరవు మండలాలుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. రూ.1305.72 కోట్లు ఆస్తుల పంపిణీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 1127 పొదుపు సంఘాలు, 996 మంది లబ్ధిదారులకు రూ.1305.72 కోట్లు ఆస్తులను కలెక్టర్ శ్రీకాంత్ పంపిణీ చేశారు. వీటిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, మెప్మా, ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ, రాజీవ్ విద్యామిషన్, మైనార్టీ కార్పొరేషన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, చేనేత,జౌళి, ఉద్యానవనశాఖలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. -ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా రూ.46.95 కోట్లు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.46.95 కోట్లుతో విద్యార్థులకు వసతిగృహాలను మంజూరు చేసినట్టు కలెక్టర్ వివరించారు. తొలుత కలెక్టర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వర్షిణి, ఏజేసీ పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


