అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు | Indian-origin couple donates 20 million Dollars to US university | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఏఐ కాలేజీకి ఎన్నారై దంపతుల పేరు

Sep 10 2026 11:23 AM | Updated on Sep 10 2026 11:33 AM

Indian-origin couple donates 20 million Dollars to US university

అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన దంపతులు విద్యారంగానికి భారీ విరాళం అందించారు. టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (UNT)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌కు ప్రత్యేక కాలేజీ ఏర్పాటుకు ఏకంగా 20 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.167 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళం అందించిన అనురాధ, వికాస్‌ సిన్హా దంపతుల పేరుతోనే కొత్త కాలేజీకి ‘అనురాధ అండ్‌ వికాస్‌ సిన్హా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌’ అని పేరు పెట్టనున్నారు.

AI, ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌, డేటా అనలిటిక్స్‌ రంగాల్లో విద్య, పరిశోధనలకు ఈ కాలేజీ కేంద్రంగా పనిచేయనుంది. AI, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లైబ్రరీ సైన్స్‌, లెర్నింగ్‌ టెక్నాలజీస్‌ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ఈ కాలేజీ ఉపయోగపడుతుందని వర్సిటీ అధ్యక్షుడు హారిసన్‌ కెల్లర్‌ తెలిపారు.

ఈ విరాళంతో కాలేజీ నాయకత్వం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ప్రొఫెసర్‌షిప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇంక్యుబేషన్‌, అధునాతన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మద్దతుగా ఆరు శాశ్వత ఎండోమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే *అప్లైడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌*ను కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఇది వర్సిటీలోని వివిధ విభాగాల మధ్య AI, డేటా సైన్స్‌ పరిశోధనలకు సమన్వయం చేస్తూ పరిశ్రమలతో భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనుంది.

చదువు కోసం అమెరికాకు.. ఇప్పుడు భారీ విరాళం
వికాస్‌, అనురాధ ఇద్దరూ భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీలు పొందారు. వికాస్‌ సిన్హా నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీలోనూ చదివి, 2023లో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ నుంచే పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన బ్రాడ్‌కామ్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

సిన్హా దంపతులు ఇప్పటికే UNTకు పలు సందర్భాల్లో భారీగా అండగా నిలిచారు. 2024లో వారు అందించిన విరాళంతో అనురాధ అండ్‌ వికాస్‌ సిన్హా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు, పరిశోధనలకు మద్దతుగా ఎండోమెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడాదికే మరో భారీ విరాళంతో సిన్హా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఫర్‌ డేటా సైన్స్‌ను ఏర్పాటు చేశారు.

“మాకు ఈ విరాళం అంటే అవకాశాన్ని మరో తరానికి అందించడం. వలస వచ్చినవారు అమెరికన్‌ డ్రీమ్‌లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. దాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. విద్య మా జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరికొందరికి తెరిచి ఉంచాలనుకుంటున్నాం” అని వికాస్‌ సిన్హా తెలిపారు.

AI, డేటా ఆధారంగా భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్‌ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కొత్త తరం విద్యార్థులను అందుకు సిద్ధం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం, పరిశ్రమలతో అనుసంధానం పెంచడం ఈ కొత్త కాలేజీ ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.

(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement