న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్, ‘ఎక్స్’ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం 1980ల నాటి ఫొటోల ట్రెండ్ వైరల్‌గా మారింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సాధారణ సెల్ఫీలను.. పెద్ద హెయిర్‌స్టైల్, పాతకాలపు దుస్తులు, ఫిల్మ్ గ్రెయిన్‌తో కూడిన రెట్రో ఫొటోలుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల క్రితం తాము ఎలా కనిపించి ఉండేవారమో ఊహించుకుంటూ, రూపొందించిన ఈ చిత్రాలను పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.
చూడటానికి ఇది సరదా సోషల్ మీడియా ఛాలెంజ్‌లా కనిపిస్తోంది. ఇప్పటి యువత నాటి సాంకేతికత, భౌతిక మాధ్యమాలు, రెట్రో రూపకల్పన వైపు మొగ్గుచూపుతున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఇటీవల పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో మరింత స్పష్టంగా, స్పృశించగలిగే అనుభూతిని కోరుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. మనస్తత్వవేత్త క్లే రౌట్లెడ్జ్ యువత తాము చూడని కాలాలపైనా ఎందుకు ఆకర్షితులవుతారో అధ్యయనం చేస్తున్నారు. ‘బిగ్ థింక్’లో ఇటీవల ప్రచురితమైన కథనంలో ఆయన దీనిని ‘హిస్టారికల్ నాస్టాల్జియా’గా పేర్కొన్నారు. నాస్టాల్జియా మన జీవితానికి అర్థం, సామాజిక అనుబంధం, సృజనాత్మకత, ఆశావాదాన్ని పెంపొందించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయని అన్నారు. ఆయన బృందం నిర్వహించిన సర్వేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది తాము పుట్టకముందు కాలంపై ఆసక్తి కలిగి ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.
అయితే 1980ల ట్రెండ్ నిజంగా ఆ కాలంలో జీవించాలనే కోరికను సూచించకపోవచ్చు. అప్పటి జీవనశైలి, ఫొటోలు, పాత సంగీతం, కుటుంబ ఆల్బమ్‌లు లేదా ఫోన్ లేకుండా కలిసి గడిపిన సమయం వంటి అనుభూతులనే కొందరు కోరుకుంటుండవచ్చు. ఈ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్లు, జనరేటివ్ ఏఐకి ముందున్న కాలాన్ని పునఃసృష్టించేందుకు నేటి అత్యాధునిక సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యాడ్ యువర్స్’ లాంటి ఫీచర్ల ద్వారా వినియోగదారులు తమ రెట్రో చిత్రాలను రూపొందించుకుని, ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు!


