‘కాక్రోచ్‌గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు | Vijay Mallya Says Maybe Life As A Cockroach Is Better Amid Legal Battles And Injustices In India, Check Post Inside | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు

Sep 10 2026 9:19 AM | Updated on Sep 10 2026 10:18 AM

Vijay Mallya Says Maybe Life as a Cockroach Is Better Amid Legal Woes

బ్యాంకు రుణాల ఎగవేత, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవహారం, మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ఆయన.. తనపై భారత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా మరోసారి ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, నిధుల నుంచి బ్యాంకులకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మాల్యా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తనపై జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న అన్యాయాలన్నింటినీ చూస్తుంటే.. నేను కాక్రోచ్‌గా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా కాక్రోచ్‌ వైపు జీవితం మెరుగ్గా ఉండొచ్చు’’ అని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

ఇదే సమయంలో ఇటీవల సోషల్‌ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత చేసిన బొద్దింకల వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరిక్‌ క్యాంపెయిన్‌గా పుట్టుకొచ్చింది సీజేపీ, అభిజిత్‌ దీప్కే నేతృత్వంలో పుట్టిన ఈ పార్టీ.. ఆ తర్వాత జంతర్‌ మంతర్‌ నీట్‌ నిరసనలతో దేశం చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్‌’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ మాల్యా చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

రూ.14 వేల కోట్లపై మాల్యా వాదన
తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మాల్యా ఈడీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. తన నుంచి రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నిధులను స్వాధీనం చేసుకుని, వాటిని తాను బకాయిపడిన బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని ఆయన అన్నారు. 2021లోనే ఈ మొత్తాన్ని బ్యాంకులకు అందించినట్లు తెలిపారు.

‘‘నా మాటలను నమ్మకపోతే పర్వాలేదు. కోర్టులో ఈడీ ఏం చెప్పిందో చూడండి’’ అంటూ తన వాదనకు మద్దతుగా మాల్యా పేర్కొన్నారు. తనపై భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే తన ఆస్తులు, నిధుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులకూ చెల్లింపులు
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ అటాచ్‌ చేసిన తన నిధుల నుంచి రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. తన వద్ద నిధులు ఉన్నప్పటికీ.. అవి ఈడీ అటాచ్‌ చేయడంతో తాను నేరుగా చెల్లింపులు చేయలేకపోయానని వివరించారు.

ఇదే సందర్భంగా తన నివాసం, పౌరసత్వం, భారత్‌కు తిరిగి రావడం వంటి అంశాలపై వస్తున్న విమర్శలకు మాల్యా వివరణ ఇచ్చారు. బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా ఉండటం, అక్కడి పౌరసత్వం కలిగి ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పారు. అలాగే బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి తాను తప్పనిసరిగా భారత్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

‘భగోడా’ వ్యాఖ్యలపైనా స్పందన
భారత్‌కు తిరిగి రావడం లేదంటూ తనను ‘భగోడా’(పరారీలో ఉన్న వ్యక్తి) అని విమర్శిస్తున్న వారిపైనా మాల్యా ఇటీవల స్పందించారు. తాను 1992 నుంచే బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదాలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనపై తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. 2026 ఫిబ్రవరిలోనూ మాల్యా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటన్‌ కోర్టుల ఆంక్షల కారణంగా ఇంగ్లండ్‌, వేల్స్‌ నుంచి బయటకు వెళ్లలేనని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దాన్ని కలిగి ఉండటం కూడా తనకు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్‌, ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాల్యా భారత్‌లో పలు కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఐడీబీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాత మాల్యాపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్‌ విడిచి బ్రిటన్‌ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనను భారత్‌కు తీసుకురావడం, బ్యాంకుల బకాయిలు వసూలు చేయడం వంటి అంశాలపై భారత్‌, బ్రిటన్‌లలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.

అయితే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను మాల్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యతో మరోసారి తనపై జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్నదంతా అన్యాయమేనన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: ఆమె రీ ఎంట్రీకి ఇదే మాంచి ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement