కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌పై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని చెప్పారు.
భాటియా నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని, తనకు సంబంధించిన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, తిరిగి పోస్టు చేయడం, ప్రసారం చేయకుండా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును కోరారు. సామాజిక మాధ్యమాల నుంచి వివాదాస్పద సమాచారాన్ని తొలగించాలని కూడా ఆయన కోరారు.
స్వతంత్ర భరద్వాజ్‌కు సంబంధించి భాటియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రచారం చేయడంతో వివాదం మొదలైందని దావాలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని భాటియా ఖండించి, పోస్టును తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సౌరవ్ దాస్‌ను కోరారు.
సౌరవ్ దాస్ ఆ పోస్టును తొలగించి, అది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ అని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసినట్లు దావాలో పేర్కొన్నారు. అయితే ఆ సమాచారం ఇతరులు కూడా ప్రచారం చేశారని భాటియా ఆరోపించారు. ఆశుతోష్ రాంకా కూడా దాస్ ఖాతా నుంచి ఆ గ్రాఫిక్‌ను తిరిగి పోస్టు చేసి, భారతీయ జనతా పార్టీ నేతలను ఎగతాళి చేసే కామెంట్‌ను జత చేసినట్లు దావాలో ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగా ప్రచారం!
తనపై తప్పుడు, కల్పిత, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించి ప్రసారం చేశారని భాటియా ఆరోపించారు. ఆ పోస్టుల్లో ఒకదాన్ని ప్రచురించిన కొద్దిసేపటికే 1.32 లక్షలకు పైగా మంది చూశారని దావాలో పేర్కొన్నారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠ, వృత్తిపరమైన స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని భాటియా తెలిపారు.
సౌరవ్ దాస్ గతంలో ఉమర్ ఖలీద్, న్యాయవ్యవస్థపై చేసినట్లు ఆరోపించిన కొన్ని పోస్టులను కూడా దావాలో ప్రస్తావించారు. నిర్దిష్ట న్యాయ వ్యవహారంపై న్యాయమైన విమర్శల పరిధిని ఆ పోస్టులు దాటి న్యాయవ్యవస్థపై విస్తృత దాడిగా మారాయని భాటియా ఆరోపించారు.
రిజిస్టర్‌కాని సంఘం పేరుతో ప్రతివాదులు న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నారని దావాలో ఆరోపించారు. అయితే ఇవన్నీ పౌర దావాలో చేసిన ఆరోపణలే. వాటిపై ఢిల్లీ హైకోర్టు ఇంకా విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేదు.


