ఇవి అచ్చంగా హత్యలే! | Sakshi Editorial On Delhi building collapse | Sakshi
Sakshi News home page

ఇవి అచ్చంగా హత్యలే!

Sep 9 2026 12:52 AM | Updated on Sep 9 2026 12:52 AM

Sakshi Editorial On Delhi building collapse

పీడలా వెంటాడుతున్న పేదరికంనుంచి తప్పించుకుందామని... మెరుగైన జీవితాన్ని అందుకుందామని చదువుల కోసం, కోచింగ్‌ కోసం, చిన్నా చితకా కొలువుల కోసం దేశ రాజధాని నగరం వచ్చే లక్షలమంది యువతకు అక్కడ అడుగడుగునా మృత్యువు పొంచివుంటుందని తెలియదు. బడాయి కబుర్లుచెప్పి గద్దెలెక్కే నేతలకు ఇలాంటివేమీ పట్టవని అసలే తెలియదు. అందుకే ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ సత్యనికేతన్‌ కాలనీ పీజీ హాస్టల్‌లో ఏడుగురు యువకులు తనువు చాలించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారు మమ్మల్ని కాపాడండని ఆర్తనాదాలు చేస్తున్నా అవి అరణ్యరోదనలే అయ్యాయి. ఆలస్యంగా మొదలైన సహాయక చర్యల్లో కొందరు ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీకి ఇలాంటి విషాదకర ఉదంతాలు కొత్తగాదు. గత పదేళ్లకాలంలో చూసుకున్నా వీటి సంఖ్య ఎక్కువే. మొన్నటికి మొన్న మే నెలాఖరు, జూన్‌ మొదటివారం మధ్య రెండుచోట్ల ఇటువంటివే చోటు చేసుకున్నాయి. 

అయిదంతస్తుల భవంతి కూలిన ఘటనలో ఆరుగురు మరణించగా,20 మంది గాయపడ్డారు. మరో మూడు రోజులకు ఒక హోటల్‌ మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అక్కడ ఆరు గదులకు అనుమతి తీసుకుని ఏకంగా 26 గదులు నిర్మించి అద్దెకిచ్చారు. కుప్పకూలేందుకు సిద్ధంగా ఉండే భవంతుల్ని పోల్చుకోవటం పెద్ద కష్టం కాదు. అవేమీ బయటకు రాజమహళ్ల మాదిరిగా కనబడవు. నాచుపట్టిన గోడలతో, పెచ్చులూడిపడుతూ, కరెంటు వైర్లు వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉంటాయి. లోపలికెళ్తే ఇరుకిరుకు గదులు, విరగడానికి సిద్ధంగా ఉండే మంచాలు, టేబుళ్లు, పెద్దగా ధ్వని చేసుకుంటూ ఎప్పుడు మీదపడతాయో తెలియని ఫ్యాన్లు దర్శనమిస్తాయి. ఎక్కడికక్కడ నల్లా గొట్టాలు చిట్లి నీళ్లు లీకవుతుంటాయి. కానీ ఓట్ల కోసం ఇల్లిల్లూ తిరిగే నాయకులకు ఇవేమీ కనబడవు. గెలిచాక అసలే పట్టవు. అధికార గణానికీ, సిబ్బందికీ ఇలాంటి భవంతులు అదనపు ఆదాయ మార్గాలు. 

వివిధ పట్టణాల్లో, నగరాల్లో చదువుల్లో టాపర్లుగా ఉంటూ, పోటీ పరీక్షల్ని సునాయాసంగా గెలుచుకునే పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 90 కళాశాలల్లో చేరడానికి వస్తారు. వీటిల్లో చేరే లక్షన్నరమందిలో అత్యధికులు బయటివారే. కానీ కేవలం 20 కళాశాలలకు మాత్రమే హాస్టల్‌ సదుపాయం ఉంది. అవి 3,000 మందికి మించి చోటిచ్చే అవకాశం ఉండదు. ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర పరిధుల్లోని యూనివర్సిటీలు, ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు మొత్తంగా 38 ఉంటాయి. వీటిల్లో 5 లక్షలమంది విద్యార్థులుంటే ఇందులో మూడింట రెండొంతులమంది బయటివారే. దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తోందని గంభీరోపన్యాసాలిచ్చే వారికి ఇవేమీ కనబడవు. కనీసం నెలకు పదో పదిహేనో భవంతుల్ని తనిఖీ చేసి నివాసయోగ్యం కాని, అగ్నిప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నవాటిని గుర్తించి తక్షణం ఖాళీ చేయించేలా తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండదు. పదే పదే చోటుచేసుకునే ఉదంతాల్ని చూశాకైనా కళ్లు తెరవాలని తోచదు. 

ఒకప్పుడు జనావాసంగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు హాస్టళ్లకు అనుమతించారు. ఈ మహానగరంలో మనుగడ సాగించటానికి ఉన్నంతలో అవే దిక్కని మధ్యతరగతి, దిగువమధ్యతరగతి పిల్లలు వస్తారు. కానీ అవి సురక్షితమో కాదో, కట్టడం నాణ్యత ఏ మేరకుందో చూసే నాథుడుండడు. సొమ్ము వచ్చిపడేసరికి ఉదారంగా అనుమతులీయటం ఒక్కటే అధికారులకు తెలుసు. చిత్రమేమంటే... సాధారణ సమయాల్లో వీటిపై ఏమాత్రం శ్రద్ధపెట్టని నేతలు ఏదైనా జరిగాక పరామర్శకొస్తారు. ఇకపై ఇలాంటివి జరగబోవని ఉదారంగా హామీ ఇస్తారు. ఎన్నడో 2007లో రూపొందించిన నిబంధనల్లో ఇలాంటి భవంతుల్ని వెంటవెంటనే గుర్తించి ఖాళీ చేయించాలని ఉన్నా తమకు పట్టింపులేకపోయిందన్న సంగతి తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇంతకూ నలుగురు అధికారుల్ని సస్పెండ్‌ చేశామని చెప్పడం ఎవర్ని వంచించటానికి? ఇవి ప్రమాదాలు కాదు... అవినీతి, నిర్లక్ష్యం కలగలిసిన పర్యవసానంగా జరిగిన హత్యలు. ఇందుకు బాధ్యత కేవలం ఆ అధికారులదేనా? పాలకులకు జవాబుదారీతనం ఉండదా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement