ఎంతసేపూ అభివృద్ధి, లాభార్జన, ఆర్థికప్రగతి గురించి మాత్రమే హోరెత్తే ప్రపంచంలో వాతావరణం ఎలావుందో, అది మున్ముందు ఎలా పరిణమిస్తుందో హెచ్చరించే సంస్థలు కూడా ఉన్నాయి. పరుగులు ఆపి సరిచూసుకోనట్టయితే ఈ భూగోళమే పెను ప్రమాదంలో పడుతుందని ఆ సంస్థలు మరోసారి హెచ్చరించాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ), ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ)లు ఒకరోజు తేడాలో తమ నివేదికలు విడుదల చేశాయి.
‘అత్యంత బలమైన’ ఎల్‌నినో విరుచుకుపడటం, అది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగటం తథ్యమని డబ్ల్యూఎంఓ చెబుతోంది. అందువల్ల ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకోవటంతోపాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ సంస్థ వివరించింది. ఈ దశాబ్దం చివరినాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని యూఎన్‌ఈపీసంస్థ హెచ్చరించింది. ప్రభుత్వాల విధానాలు ఇప్పుడున్న విధంగానే కొనసాగితే2100 నాటికి ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని అది జోస్యం చెప్పింది.
కానీ పారిస్ ఒప్పందంలో పూచీపడిన విధంగా ప్రభుత్వాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకుంటే అది 1.8 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమయ్యే అవకాశం లేకపోలేదని వివరించింది. ఈ రెండు సంస్థలూ చెప్పాయని కాదు... రాబోయే రోజులెలా ఉండబోతు న్నాయో ప్రస్తుత పరిస్థితులే చెబుతున్నాయి. ఇటీవల నేపాల్‌లో వచ్చిన మెరుపు వరదల వల్ల దాదాపు 1,300 మంది చనిపోగా, అనేకులు ఆచూకీ లేకుండా పోయారు. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. కనీవినీ ఎరుగని విధ్వంసం చోటుచేసుకుంది.
పర్యావరణ పరిరక్షణతో సమస్త జీవుల మనుగడ ముడిపడివుందని ప్రపంచంగ్రహించి దాదాపు అరవయ్యేళ్లవుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి పాలకుల పుణ్యమా అని ఇప్పటికీ వివాదాస్పద అంశంగానే ఉంటోంది. పర్యావరణ ధ్వంసం అమెరికా అభివృద్ధి గిట్టనివారి సృష్టి అని ఆయన అభిప్రాయం. తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తుందంటూ ఏకంగా పారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. విషాదమేమంటే ఆ ఒప్పందంలో కొనసాగుతూ కూడా, దాని లక్ష్యాలను విస్మరిస్తున్న దేశాలున్నాయి.
అభివృద్ధి పేరిట ఇష్టానుసారం ప్రాజెక్టులకు అనుమతు లీయటంవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, కాలుష్యం పెరుగుతున్నదని పర్యావరణ ఉద్యమకారులు వాదిస్తుంటే... మరి అభివృద్ధి మాటేమిటన్నది ప్రభుత్వాల ప్రశ్న. పారిశ్రామిక విప్లవంకంటే ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2030 నాటికి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ లోపులో ఉంచాలని, ఎట్టిపరిస్థితు ల్లోనూ అది 2 డిగ్రీలు దాటరాదని పారిస్ ఒప్పందం నిర్దేశించింది. ఇందుకోసం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 42 శాతం మేర తగ్గించాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలు పాటిస్తున్న విధానాలేవీ దానికి అనుగుణంగా లేవు. అందువల్లే ధ్రువప్రాంతాల్లో వేగంగా మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, పెను తుపానులు, కరువుకాటకాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు సర్వసాధారణమయ్యాయి.
చారిత్రకంగా చూస్తే 1850 నుంచి ఇంతవరకూ 25 శాతం ఉద్గారాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంటే దాదాపు 22 శాతం వాటాతో యూరప్ దేశాలు, దాదాపు 7 శాతంతో రష్యా ఉన్నాయి. కానీ ఏటా వెలువరించే కర్బన ఉద్గారాల్లో చైనా ఇప్పుడు అగ్రభాగాన ఉంది. తలసరి ఉద్గారాల్లో ఇప్పటికీ మనం ప్రపంచ సగటుకన్నా తక్కువగానే ఉన్నాం. పునరుత్పాదక ఇంధన రంగానికి మారడానికి అవసరమైన సాంకేతికతలనుపొందాలంటే భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయన్న అంచనా ఉంది.
అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఈ సాంకేతికతల్ని చవగ్గా అందిస్తే మనం మాత్రమే కాదు... చాలా దేశాలు వీటిని పొందగలుగుతాయి. నిరుడు బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగిన కాప్–30 సదస్సులో కొత్త సాంకేతికతల కోసం 2035 నాటికి 31,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. భూగోళమే ప్రమాదంలో పడిందని సమితిసంస్థలు రెండూ చెబుతున్న నేపథ్యంలోనైనా సంపన్న దేశాలు లాభార్జన దృష్టి విడనాడాలి. లేకుంటే మూకుమ్మడిగా అందరం మునిగే ప్రమాదం ఉంటుందన్న స్పృహ తెచ్చుకోవాలి.


