ఆగస్టులోనూ లోటే | Rainfall reduced by 38 percent in August due to El Nino in Telangana | Sakshi
Sakshi News home page

ఆగస్టులోనూ లోటే

Sep 1 2026 3:21 AM | Updated on Sep 1 2026 3:21 AM

Rainfall reduced by 38 percent in August due to El Nino in Telangana

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టులో 38 శాతం తగ్గిన వర్షపాతం

ఈ సీజన్‌లో ఇప్పటివరకు సగటున 17 శాతం మేర తగ్గుదల 

సెప్టెంబర్‌తో ముగియనున్న వర్షాకాలం.. ఇక అల్పపీడనాలు ఏర్పడితేనే వర్షాలకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌ మూడో నెల కూడా తీవ్ర నిరుత్సాహంగానే ముగిసింది. జోరుగా వర్షాలు కురవాల్సిన ఆగస్టులో భారీ లోటు వర్షపాతమే నమోదైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఇందులో తొలి మూడు నెలలు రాష్ట్రంలో లోటు వర్షపాతంతోనే ముగిశాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సీజన్‌లో ఇప్పటివరకు 57.35 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 47.38 సెం.మీ. మేర వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే దాదాపు 10 సెం.మీ. వర్షం తక్కువగా కురిసింది. ఈ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగియనున్నప్పటికీ ఈ నెలలోనూ లోటు వర్షపాతం ఉంటుందని ఐఎండీ ఇప్పటికే ప్రాథమిక అంచనాలు విడుదల చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ నెలలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండవని.. పైగా ఎల్‌నినో మరింత బలపడుతుందని.. ఫలితంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారం నుంచి రుతుపవన ద్రోణి, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి ఏర్పడినప్పడు వాతావరణంలో జరిగే మార్పులు రాష్ట్రంపై అనుకూల ప్రభావం చూపితే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందని చెబుతున్నారు. 

17 జిల్లాల్లో లోటు వర్షపాతం... 
ప్రస్తుత నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను సాధారణ కేటగిరీలోకి చేర్చారు. సాధారణ వర్షపాతం గణాంకాలకు అత్యంత సమీపంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలున్నాయి. మిగిలిన జిల్లాల్లో వర్షపాతం ఆశించినంతగా లేదని ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో తొమ్మిది జిల్లాల్లో 30 శాతానికిపైగా లోటు నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement