సిటీల్లో శాని'టెన్షన్‌'! | Garbage is everywhere in major municipal corporations | Sakshi
Sakshi News home page

సిటీల్లో శాని'టెన్షన్‌'!

Sep 1 2026 2:34 AM | Updated on Sep 1 2026 2:34 AM

Garbage is everywhere in major municipal corporations

నిజామాబాద్‌ నగరం న్యాల్‌కల్‌ రోడ్డులోని భవానీనగర్‌లో ఇళ్ల మధ్య మురుగునీటి కూపమిది. వర్షపు నీళ్లు, ఇళ్లలోని డ్రైనేజీ నీళ్లు ఇక్కడకు చేరడంతో దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరని కాలనీవాసులు వాపోతున్నారు

ప్రధాన నగరపాలక సంస్థల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త

డ్రైనేజీలు లేక ఖాళీ స్థలాల్లోకి మురుగు.. దుర్వాసన 

ప్రబలుతున్న మలేరియా, డెంగీ, విష జ్వరాలు 

అధ్వానంగా మారిన రహదారులు

కార్పొరేషన్లలో క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రధాన, అంతర్గత రోడ్లు, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోతోంది.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఖాళీ స్థలాలు మురికి నీటి కుంటలుగా మారాయి. ఇదీ కార్పొరేషన్ల పరిధిలోని ప్రస్తుత పరిస్థితి. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మలేరియా, డెంగీ, విష జ్వరాలు ప్రబలుతున్నాయి. శివారు కాలనీల్లో చాలాచోట్ల మట్టి రోడ్లే ఉండటంతో వర్షాలకు బురదమయమై అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో గుంతలు పడి అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా కార్పొరేషన్లలో పారిశుధ్య పరిస్థితులపై ‘సాక్షి’గ్రౌండ్‌ రిపోర్టు. 

ఓరుగల్లు: మురికికూపాలుగా ఓపెన్‌ ప్లాట్లు 
గ్రేటర్‌ వరంగల్‌లోని 66 డివిజన్లలో రోజుకు 360 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇదికాక రోజు వారీగా ఇళ్లు, డంపర్‌ బిన్‌లు, ఖాళీ ప్రదేశాల్లో 110 మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోతోందని అంచనా. 3,600 ఖాళీ ప్రదేశాలు (ఓపెన్‌ ప్లాట్లు ) ఉండగా వీటిలో ఎక్కువ శాతం మురుగునీరు నిలిచింది. డ్రెయిన్లు రోడ్లు సరిగా లేక ఖాళీ ప్లాట్లు మురుగునీటి ఆవాసాలుగా మారాయి. దీని ప్రభావంతో జూన్‌ నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ పరిధిలో 60 డెంగీ, 39 టైఫాయిడ్, 1,148 సాధారణ జ్వరాలు నమోదయ్యాయి. 

నిజామాబాద్‌ : శాని‘టెన్షన్‌’ 
నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కొన్ని డివిజన్లలో మూడు రోజులకోసారి చెత్త సేకరణ జరుగుతోంది. దీంతో కూడళ్లలో చెత్త వేస్తుండగా దుర్వాసనతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. 467 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైయిన్ల నుంచి వచ్చే మురుగు ఖాళీ స్థలాల్లో నిలుస్తోంది. బోధన్‌ రోడ్డులోని అర్సాపల్లి, కోజా కాలనీ, రోటరీనగర్, సాయినగర్, అయోధ్యనగర్‌ లోతట్లు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో పలు కూడళ్లు చెత్తకు నిలయంగా ఉన్నాయి.శివారు కాలనీల్లో రోడ్లు లేవు.  

నల్లగొండ : డ్రెయినేజీలు అస్తవ్యస్తం 
నల్లగొండ కార్పొరేషన్‌లో డ్రెయినేజీ వ్యవస్థ కొన్ని కాలనీల్లో సరిగా లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మూడేళ్ల కిందట సూర్యవంశం కాలనీ వద్ద డ్రెయినేజీ పనులను అసంపూర్తిగా వదిలేశారు. అప్పటి నుంచి ఇక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. సూర్యవంశ కాలనీ, చైతన్యపురి, ముత్యాలమ్మ కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరచడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు పూర్తి కావడానికి నెలలు పట్టే అవకాశం ఉంది.  

కరీంనగర్‌ : ఇళ్ల మధ్యే మురుగు 
కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని ఓపెన్‌ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరిగి, మురుగు నీరు నిలిచి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. 29వ డివిజన్‌లో ఎక్కువ ఖాళీ ప్లాట్ల మధ్య మురుగు నీరు నిలిచి స్థానికులు దుర్వాసన భరించలేకపోతున్నారు. 
– రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 71 మురుగు ప్రాంతాలు, ఐదు వేల ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌లోనూ ఇళ్ల మధ్య రోజుల తరబడి చెత్త ఉంటుంది. శివారు కాలనీలకు సీసీ రోడ్లు లేక, ఇటీవల కురుస్తున్న వర్షాలకు బురదమయమయ్యాయి.  

ఖమ్మం : డ్రెయినేజీల్లో పూడిక తీయక.. 
ఖమ్మం కార్పొరేషన్‌లోని శివారు కాలనీల్లో నెలల తరబడి పూడిక తీయక చిన్నపాటి వర్షానికే మురుగు నీరు పొంగి వీధుల్లో ప్రవహస్తోంది. నగర విస్తరణకు తగినట్టు డ్రెయినేజీల నిర్మాణం జరగక ఎగువ నుంచి వస్తున్న మురుగు వరదతో వైరా రోడ్డు, రాపర్తినగర్‌ బైపాస్‌ రోడ్లు వర్షాలు వచ్చిన సమయంలో జలమయం అవుతున్నాయి.  
– కొత్తగూడెం కార్పొరేషన్‌లోనూ చెత్త సేకరణ అన్ని డివిజన్లలో సరిగా చేయడం లేదు. రోజుల తరబడి చెత్త కూడళ్లలో ఉంటోంది. ఈ కార్పొరేషన్‌లో 24 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.  

 
ఇదీ నిజామాబాద్‌ సాయినగర్‌లోని చంద్రానగర్‌ కాలనీ. మూడు రోజులుగా చెత్త సేకరణ చేపట్టడం లేదు. రాఖీ పండగ కారణంగా పారిశుధ్య కార్మికులు లేక, చెత్త సేకరణ వాహనం రాక చుట్టుపక్కల కాలనీవాసులు తీసుకొచ్చి చౌరస్తాలో వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు అన్నీ ఓపెన్‌ డ్రెయినేజీలో చేరుతున్నాయి.  


ఇదీ రామగుండం కార్పొరేషన్‌ పరిధి శ్రీదుర్గానగర్‌లోని ప్రధాన రోడ్డు దుస్థితి. ఇటీవల కురిసన వర్షాలకు రోడ్డు బురదమయమైంది. అడుగు తీసి అడుగు వేయడానికి వీలులేకుండా ఉంది. సీసీ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేస్తారని కాలనీలువాసులు పలుమార్లు కార్పొరేషన్‌ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. సిమ్స్‌ మెడికల్‌ కాలేజీ సమీపంలోని రాజ్యలక్ష్మీ కాలనీ పరిస్థితి కూడా ఇంతే. 

మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నాం  
పై కాలనీల నుంచి వరద కాలువ తీసుకొచ్చి మా ఇంటి సమీపంలో అసంపూర్తిగా వదిలేశారు. దీంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధం వస్తోంది. మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఈ కాలువలో నుంచి పురుగులు, పాములు ఇంటి ముందుకు వస్తున్నాయి. వర్షాకాలంలో పనులు చేస్తామంటూ ఏటా దాటవస్తున్నారు.  
– పగిడిపల్లి ప్రసాద్, సూర్యవంశంకాలనీ, నల్లగొండ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement