మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం నిర్మాణంలో ఉన్న లోలెవల్ బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కాలేరు వెంకటేశ్, వి.హనుమంతరావు తదితరులు
వెయ్యి రోజులుగా పనిచేస్తూనే ఉన్నా: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రతిపక్ష నాయకుడు పేదల కోసం ఒక్క గంట కూడా పనిచేయలేదు
ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలి
ఇందుకోసం జిల్లాల్లో బైక్ ర్యాలీలు, 6న హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయాలి
లేదంటే 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలి
ఎవరేం చేశారో చర్చిద్దాం.. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం
మూసారాంబాగ్ హైలెవల్ వంతెన ప్రారంభ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెయ్యి రోజుల్లో తాను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ వెయ్యి రోజుల్లో కనీసం ఒక్క గంటైనా పేదల కోసం పని చేశారా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ హైలెవల్ వంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో ఫాంహౌస్‌లో పడుకుంటే సరిపోతుందా అని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్.. కొడుకు, అల్లుడు, కుటుంబ సభ్యులను మంత్రులు, ఎంపీలుగా చేసుకున్నారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో తన కుటుంబం నుంచి ఒక్కరైనా ఉన్నారా అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో కొందరు కలిసి రూ. లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ఈ వెయ్యి రోజుల్లో వేతనంగా రూ. 1.24 కోట్లు, వాహనాలు, సెక్యూరిటీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ. 21 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఏడాదిపాటు విధులకు హాజరు కాకపోతే డిస్మిస్ చేస్తారని.. మరి ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్‌ను ఏం చేయాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు విఫలమవడం చూస్తాం కానీ.. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మండలాలు, జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 6న ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాలని.. 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ధైర్యముంటే కేసీఆర్ వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో వెయ్యి రోజుల్లో తాను ఏం చేశానో చర్చిద్దామన్నారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు దక్కలేదనే అక్కసుతోనే తన వెయ్యి రోజుల పాలనను వైఫల్యమంటున్నారని.. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ తాము కొనసాగిస్తున్నామని సీఎం గుర్తుచేశారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు..
విధ్వంసమైన తెలంగాణను ఒక్కొక్కటిగా కూడదీసుకుంటూ వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27.50 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.. ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరన్నారు. గత పదేళ్లలో గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలతోపాటు పోలీసు, ఉపాధ్యాయ, వైద్య, నర్సింగ్ తదితర ఏ శాఖలోనూ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుల్లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెబుతోందని సీఎం అన్నారు.
టిమ్స్ ఆసుపత్రులకు ప్రముఖుల పేర్లు..
రాష్ట్రంలోని టిమ్స్ ఆసుపత్రులకు ప్రముఖ తెలంగాణ నేతల పేర్లు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా సనత్‌నగర్ టిమ్స్‌కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు, అల్వాల్ టిమ్స్‌కు టి. అంజయ్య పేరు, ఎల్బీనగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ టిమ్స్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తూ, గత 30 నెలల్లో పేదల ఆరోగ్యం కోసం రూ. 5,200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేసీఆర్ తన పాలనలో కూలిపోయే దశలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని కూడా కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేయలేదని, ఏనాడైనా పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన భావించారా అని ప్రశ్నించారు.
వారంతా నా కుటుంబ సభ్యులే
‘ఉద్యోగ సంఘాలు నన్ను బెదిరిస్తున్నాయి.. కాదు కాదు, వారంతా నా కుటుంబ సభ్యులే. వారి సమస్యలను నేను పూర్తిగా అర్థం చేసుకుంటా’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గత 32 నెలల పాలనలో ఏ ఒక్క నెలైనా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకుండా ఆపేశానేమో ఉద్యోగులంతా ఆలోచించాలని కోరారు. ‘ఒకప్పుడు చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, సిబిల్ స్కోర్ పడిపోతోందని ఉద్యోగ సంఘాల నేతలే చెప్పారు. కానీ 2024 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం. ఆనాడు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలకోసారి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి నెలా 5వ తేదీలోపే వేతనాలు జమ అవుతున్నాయి. అధికారులు ఎక్కడైనా అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పాను’అని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడంతో, వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం 2024 నుంచే తనపై పడిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం నెలకు వెయ్యి మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండగా, ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. 8 వేల కోట్ల బకాయిలను వదిలి వెళ్లినా ఉద్యోగుల బాధలను చూసి మిగతా పనులన్నీ పక్కన పెట్టి వంద రోజుల్లోనే రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను విడుదల చేశామని సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వం పీఆర్‌సీ ఇవ్వకపోయినా తాము ఇచ్చామని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు లేకపోతే నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వాటిని పునరుద్ధరించామని చెప్పారు.ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కింద గత 32 నెలల్లో ఆర్టీసీకి రూ. 11 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు వెంకటేశ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేష్, నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణణ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తదితరులు పాల్గొన్నారు.


