(ఆదిలాబాద్ నుంచి శివప్ప ముదిరాజ్)
మావోయిస్టు అగ్రనేత మోతిబాయి అలియాస్ రాదక్క (65) సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల రిమ్స్‌లో చేరారు. ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధారి గ్రామానికి చెందిన రాదక్క, జిల్లాలో పీపుల్స్ వార్ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలంలో తొలితరం నేతల్లో ఒకరు. గ్రామంలో భూస్వామ్య శక్తుల ఆగడాలను భరించలేక ఎదిరించి, మొదట శంకరన్న నాయకత్వంలో పిప్పల్‌ధారి దళంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఇంద్రవెల్లి దళ కమాండర్, మంగి ఏరియా కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. తెలంగాణలో పార్టీపై నిర్బంధం పెరగడంతో ఆమెను దండకారణ్యానికి మార్చి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నియమించినట్లు తెలుస్తోంది.
ఇంద్రవెల్లి దళం, మంగి ఏరియాలో కమాండర్‌గా పనిచేసిన క్రమంలో, ఆదిలాబాద్ జిల్లా పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా ఉన్న పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నను ఆమె పెళ్లి చేసుకుంది. అతను ఇటీవల సెంట్రల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాదక్క గతంలో ఆదిలాబాద్ జిల్లా పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కరీంనగర్ జిల్లా రంగారావుపేటకు చెందిన వెల్లంకి అరుణ అలియాస్ లలితక్కతో కలిసి సహచరురాలిగా పనిచేశారు. లలితక్క బెజ్జూరు మండలం ఆగర్గూడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురితో కలిసి మరణించగా, రాదక్క అంతకుముందే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వెళ్లిపోయారు.
గత ఐదేళ్ల క్రితం దంతేవాడ ప్రాంతం నుంచి కుంట జిల్లా మీదుగా ఖమ్మం ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుండగా ఖమ్మం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆమె తర్వాత సాధారణ జీవితం గడిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్నారు. ఇటీవల చంద్రన్న లొంగిపోవడంతో రామగుండంలో ఉన్న ఆయనతో కొంతకాలం ఉన్నట్లు తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని గ్రామం నుంచి మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన రాదక్క మరణం పట్ల పలు విప్లవ సంఘాల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.


