బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ బార్‌లో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. మద్యం, ఆహారం తీసుకున్నాక బిల్లు చెల్లించలేకపోయిన ఓ మహిళకు అక్కడి సిబ్బంది గుండు కొట్టించారు. పింక్లావో ప్రాంతంలోని ఓ ప్రముఖ బార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆగస్టు 25న సదరు మహిళ నకిలీ గుర్తింపు కార్డుతో బార్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఆమె తీసుకున్న ఆహార, పానీయాల బిల్లు దాదాపు 60 వేల బాట్లు (సుమారు 1,812 డాలర్లు) అయింది.
అయితే, బిల్లు చెల్లించకుండానే అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా, సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వద్ద బిల్లు చెల్లించేందుకు తగిన నగదు లేకపోవడంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లకుండానే ఇరువర్గాల మధ్య ఒక వింత ఒప్పందం కుదిరింది. ఆమె జుట్టును విక్రయించేందుకు సంబంధించిన 'హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్' ఒప్పందానికి ఆమె అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది. అనంతరం బార్‌టెండర్ ఎలక్ట్రిక్ రేజర్‌తో ఆమె భుజాల వరకు ఉన్న పొడవాటి, దట్టమైన జుట్టును పూర్తిగా తొలగించి గుండు కొట్టాడు.
ఈ కత్తిరించిన జుట్టును విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. బార్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ‘బీ వన్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు చాలిదా దీనిని తీవ్రంగా ఖండించారు. మేనేజర్ ఆగ్రహంతోనే ఈ పని చేశారని, మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించేందుకు బార్ యాజమాన్యం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ఒత్తిడితో కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టబద్ధం కావని, ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధ నిర్బంధం కిందికి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై థాయ్‌లాండ్ సామాజిక అభివృద్ధి మరియు మానవ భద్రతా మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు ఆమె వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 4నా.. 5నా?.. కృష్ణాష్టమి ఎప్పుడు?


