స్కూల్లో కాల్పులు | Thailand Shocking School Shooting Incident, Student Opens Fire Inside Campus Before Taking Own Life, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

స్కూల్లో కాల్పులు

Aug 7 2026 10:18 AM | Updated on Aug 8 2026 5:26 AM

Thailand School Shooting: Student Attack Leaves Campus in Shock

బ్యాంకాక్‌ సమీపంలో దారుణం 

14 ఏళ్ల బాలుడి నిర్వాకం 

తాత, అమ్మమ్మలను కాల్చేసి పాఠశాలకు..

పాఠశాలలో తూటాలకు ఐదుగురు టీచర్ల బలి

20 మందికి పైగా గాయాలు

మరో 30 బుల్లెట్లు మిగిలి ఉండగానే నిందితుడి ఆత్మహత్య

నొంతబురి (థాయ్‌లాండ్‌): బ్యాంకాక్‌ సమీపంలోని ఓ పాఠశాలలో శుక్రవారం భారీ విషాదం చోటు చేసకుంది. పద్నాలుగేళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉపాధ్యాయులు మరణించారు. దాదాపు 20 మందికిపైగా గాయపడ్డారు. పాఠశాలకు వచ్చే ముందే ఈ విద్యార్థి తన తాత, అమ్మమ్మలను కూడా చంపేశాడు. ఆ తరువాత తాను కూడా పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 

నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్‌ నొంతబురి పాఠశాలలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తరగతి మొదలు కాగానే నిందితుడు కాల్పులు మొదలుపెట్టాడు. ఆ తరువాత బయటకు వచ్చి మరిన్ని తూటాలు పేల్చాడు. ఒక భవనం నుంచి కాల్పుల శబ్ధం వినిపించగానే మిగిలిన తరగతి గదుల్లోని విద్యార్థులు భయంతో అక్కడే దాక్కున్నారు. నిందితుడు 20కి పైగా రౌండ్లు కాల్చాడని, ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా తుపాకీలో 30 వరకూ బుల్లెట్లు మిగిలి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 గంట సేపటి తరువాత పోలీసులు తలుపు తట్టి, విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఆ తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాఠశాల వెలుపల ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. గాయపడ్డ వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని పాఠశాల సమీపంలోని బాంగ్‌యై ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పాఠశాలకు సమీపంలోనే ఉన్న ఓ హోటల్‌ యజమాని అమ్‌పోర్న్‌ నియాంఫాంగ్‌ మాట్లాడుతూ....‘‘ముందు ఒక బుల్లెట్‌ పేలిన శబ్ధం వచ్చింది. ఆ తరువాత కొంతసేపు నిశ్శబ్ధం. దీని తరువాత వరుస పేలుడు శబ్దాలు వినిపించాయి’’అని గుర్తు చేసుకున్నాడు. హోటల్‌ ముందున్న చిన్న రహదారి పిల్లలతో కిక్కిరిసిపోయిందని, చాలామంది ఏడుస్తూ కనిపించారని చెప్పాడు. 

విద్యార్థి ఇంట్లో మృతదేహాలు... 
కాల్పుల అనంతరం పోలీసులు నిందితుడి తాత, అమ్మమ్మ ఇంటికి వెళ్లగా తలుపులు మూసి కనిపించాయి. ఎవరూ స్పందించకపోవడంతో అధికారులు తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా తుపాకీ గాయాలతో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. నిందితుడు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదని, బాగా చదువుకునే వాడని అతడి మామ, తాత, అక్కచెల్లెళ్ల ద్వారా తెలిసింది. ఇంట్లోకానీ, బడిలో కానీ సమస్యలు ఉన్న విషయం తమకు తెలియదని వారు స్పష్టం చేశారు. 

అయితే... కాల్పుల ఘటన తరువాత పాఠశాలను సందర్శించిన థాయ్‌లాండ్‌ ప్రధాని అనుతిన్‌ చార్న్‌విరకుల్‌ మాత్రం నిందితుడు పాఠశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పడం గమనార్హం. అలాగే పాఠశాకు వచ్చే ముందే నిందితుడు ఇంట్లో తాత, అమ్మమ్మలను హత్య చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సువుంచ్వీ ధ్రువీకరించారు. కాల్పుల కోసం నిందితుడు ఉపయోగించిన తుపాకీ తాత పేరుతో రిజిస్టర్‌ అయి ఉందని పోలీసుల ద్వారా తెలిసింది. దాడులకు ముందు నిందితుడు మూక కాల్పులపై ఆన్‌లైన్‌లో వెతికాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement