ఫేక్‌ లైక్స్‌, రీపోస్టులతో Xలో చీటింగ్‌ గేమ్‌!.. మస్క్‌ దావా | Fake Likes Reposts and Replies: X Sues Crypto Influencers Over Scam | Sakshi
Sakshi News home page

ఫేక్‌ లైక్స్‌, రీపోస్టులతో Xలో చీటింగ్‌ గేమ్‌!.. మస్క్‌ దావా

Sep 22 2026 8:51 AM | Updated on Sep 22 2026 8:51 AM

Fake Likes Reposts and Replies: X Sues Crypto Influencers Over Scam

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ సంచలన ఆరోపణలకు దిగింది. ఫేక్‌ లైక్స్‌, రీపోస్టులు, రిప్లైలతో కృత్రిమంగా ఎంగేజ్‌మెంట్‌ పెంచి.. క్రియేటర్లకు చెల్లించే డబ్బును కొల్లగొట్టే స్కామ్‌ నడిచిందని చెబుతోంది. ఈ వ్యవహారంలో బిట్‌కాయిన్‌/క్రిప్టో కంటెంట్‌కు సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్లైన వివేక్‌ కుమార్‌ సేన్‌, జమ్యాంగ్‌ షెర్పాతో పాటు మరికొందరిపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌లోని హైకోర్టులో సివిల్‌ దావా వేసింది. తమ క్రియేటర్‌ పేమెంట్‌ వ్యవస్థను మోసం చేసి భారీ మొత్తంలో నగదును వాళ్లు సొంతం చేసుకున్నారని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తమకు ఇప్పించాలని కోర్టును కోరింది. 

ఎక్స్‌లో కొంతకాలంగా క్రియేటర్‌ రెవెన్యూ షేరింగ్‌ (Creator Revenue Sharing) అనే కార్యక్రమం నడుస్తోంది. ఇందులో అర్హత పొందిన క్రియేటర్లు తమ పోస్టుల ద్వారా వచ్చే అర్హత కలిగిన ఎంగేజ్‌మెంట్‌ ఆధారంగా ఆదాయం పొందేవారు. అయితే ఈ వ్యవస్థలో నిజమైన యూజర్ల స్పందనతో పాటు కృత్రిమంగా ఎంగేజ్‌మెంట్‌ సృష్టించే అవకాశం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా X దాఖలు చేసిన కేసు ఈ అంశాన్నే కోర్టు ముందుకు తీసుకెళ్లింది. 

ఎక్స్‌ ఆరోపణల ప్రకారం.. వివేక్‌ సేన్‌, జమ్యాంగ్‌ షెర్పా తదితరులు బిట్‌కాయిన్‌కు సంబంధించిన పలు X ఖాతాలను ఒక నెట్‌వర్క్‌లా నిర్వహించారు. ఆ ఖాతాలు ఒకదానికొకటి లైక్‌లు కొట్టడం, రీపోస్టులు చేయడం, రిప్లైలు ఇవ్వడం ద్వారా నిజమైన యూజర్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నట్టుగా కనిపించేలా చేశాయని కంపెనీ పేర్కొంది.

ఒకే కంటెంట్‌.. నిమిషాల వ్యవధిలో!
ఈ వ్యవహారం ఎలా జరిగిందో వివరించేందుకు ఎక్స్‌ తన కేసులో కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించింది. @TrendingBitcoin, @saylordocs అనే ఖాతాలు 2025 అక్టోబర్‌ 10న కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఒకే కంటెంట్‌ను పోస్టు చేసినట్లు పేర్కొంది. మరో సందర్భంలో మూడు ఖాతాలు ఒకే పోస్టుకు కేవలం 31 సెకన్ల వ్యవధిలో స్పందించినట్లు తెలిపింది. ఇలా ఒకే నెట్‌వర్క్‌లోని ఖాతాలు పరస్పరం లైక్‌లు, రీపోస్టులు, రిప్లైలతో పోస్టులకు కృత్రిమంగా స్పందనలు పెంచేవని ఎక్స్‌ ఆరోపించింది. 

ఖాతా సస్పెండ్‌ అయితే.. మరోదానితో ఆట?
ఒక ఖాతాను ఎక్స్‌ సస్పెండ్‌ చేసినా.. అదే నెట్‌వర్క్‌లోని మరో ఖాతాల ద్వారా కార్యకలాపాలను కొనసాగించేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అంటే ఒక ఖాతాపై చర్యలు తీసుకున్నా.. మిగిలిన ఖాతాల ద్వారా ప్రధాన ఖాతాలకు ఎంగేజ్‌మెంట్‌ పెంచే అవకాశం ఉండేదని పేర్కొంది.

ఇదే క్రమంలో వివేక్‌ సేన్‌ 2025 డిసెంబర్‌లో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న మరో ఎక్స్‌ ఖాతాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా దావాలో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగి ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో తాను మాట్లాడినట్లు ఆయన రాసిన సందేశాన్ని కూడా కంపెనీ తన వాదనకు ఆధారంగా ప్రస్తావించింది. 

రూ.2.6 కోట్లు ఎలా వచ్చాయి?
కృత్రిమ ఎంగేజ్‌మెంట్‌ సృష్టించిన నెట్‌వర్క్‌ ద్వారా కనీసం 207,384 పౌండ్లు క్రియేటర్‌ పేమెంట్లు పొందినట్లు ఎక్స్‌ ఆరోపిస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2.6 కోట్లు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని గుర్తించడం, దర్యాప్తు చేయడం, సమస్యను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు తమకు కనీసం మరో 75,000 పౌండ్లు ఖర్చవుతుందని ఎక్స్‌ పేర్కొంది. ఈ మొత్తంతో పాటు నష్టపరిహారం, వడ్డీ, న్యాయపరమైన ఖర్చులను కూడా నిందితుల నుంచి ఇప్పించాలని కోర్టును కోరుతోంది. 

మస్క్‌ రిప్లై చూశారా?
ఈ కేసుపై X జనరల్‌ కౌన్సెల్‌ జేమ్స్‌ ఎం. బర్న్‌హామ్‌ స్పందిస్తూ.. క్రియేటర్‌ రెవెన్యూ షేరింగ్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే దీనికి ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ డోంట్‌ మెస్‌ విత్‌ అంటూ ఇలా మోసాలకు పాల్పడే వాళ్లకు వార్నింగ్‌ తరహాలో స్పందించారు.

ఇదిలా ఉండగా.. ఎక్స్‌ ఇప్పటికే తన పాత క్రియేటర్‌ రెవెన్యూ షేరింగ్‌ కార్యక్రమాన్ని ముగించింది. సెప్టెంబర్‌ 7, 2026 వరకు ఆ ప్రోగ్రామ్‌ కింద ఆదాయాలు కొనసాగగా.. సెప్టెంబర్‌ 8 నుంచి అర్హత ఉన్న క్రియేటర్లకు ఒరిజినల్‌ కంటెంట్‌ రివార్డు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒరిజినల్‌ కంటెంట్‌ నుంచి వచ్చే అర్హత కలిగిన ఇంప్రెషన్స్‌ ఆధారంగా చెల్లింపులు చేస్తోంది. కృత్రిమంగా సృష్టించిన లేదంటే మోసపూరిత ఇంప్రెషన్స్‌ ఇందులో పరిగణనలోకి రావని ఎక్స్‌ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement