నెహ్రూ నుంచి జైట్లీ వరకు.. డీయూఎస్‌యూ సంచలన చరిత్ర! | From Rs 150 to a Political Battleground DUSUs 78 Year Journey | Sakshi
Sakshi News home page

నెహ్రూ నుంచి జైట్లీ వరకు.. డీయూఎస్‌యూ సంచలన చరిత్ర!

Sep 22 2026 7:15 AM | Updated on Sep 22 2026 7:15 AM

From Rs 150 to a Political Battleground DUSUs 78 Year Journey

ఒకప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కేవలం రూ.150 పరిపాలనా గ్రాంట్‌తో ప్రారంభమైన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) నేడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించే కీలక విద్యార్థి రాజకీయ వేదికగా మారింది. 1947లో చిన్నపాటి విద్యార్థి సంఘంగా మొదలైన ఈ ప్రయాణం.. ప్రత్యక్ష ఎన్నికలు, రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల ప్రవేశం, ఆందోళనలు, కోర్టు జోక్యాలు, ప్రచార నిబంధనల ఉల్లంఘనల మధ్య 78 ఏళ్లలో అనేక మలుపులు తిరిగింది.

రూ.150తో పుట్టిన సంఘం..
1922 మేలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ ఏర్పడింది. తొలుత సెయింట్ స్టీఫెన్స్, రామ్‌జాస్, హిందూ కాలేజీలు మూడు ప్రధాన కాలేజీలుగా ఉండగా.. ఆర్ట్స్, సైన్స్ విభాగాలతో విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి కేవలం తొమ్మిది రోజుల ముందు, 1947లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విద్యార్థుల కోసం సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రారంభ ఖర్చులుగా రూ.150 ఇవ్వాలని నిర్ణయించింది. అలా డీయూఎస్‌యూకు పునాది పడింది. ప్రస్తుతం ఈ సంఘం 91 కాలేజీల్లో 7 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎన్నికల్లో సుమారు 40 శాతం వరకు పోలింగ్ నమోదవుతోంది.

1954లో తొలి ఓటు.. పద్ధతి మాత్రం వేరు
1947-49 మధ్య డీయూఎస్‌యూ రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 ఏప్రిల్ 9న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ డీయూఎస్‌యూను అధికారికంగా ప్రారంభించారు. అయితే తొలి అధికారిక ఎన్నిక 1954లో జరిగింది. అప్పట్లో విద్యార్థులు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకునేవారు కాదు. ముందుగా కాలేజీ కౌన్సిలర్లను ఎన్నుకుని, వారు డీయూఎస్‌యూ కేంద్ర పదవులకు నాయకులను ఎంపిక చేసేవారు. తొలి దశలో విద్యార్థి సంక్షేమం, లైబ్రరీ నిబంధనలు, సమస్యల పరిష్కారం వంటి అంశాలే ప్రధానంగా ఉండేవి.

1972 ఆందోళన.. 1973లో ప్రత్యక్ష ఎన్నికలు
1960లలో ఏబీవీపీ, కాంగ్రెస్‌కు అనుబంధమైన ఎన్‌ఎస్‌యూఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు వంటి సంస్థలు డీయూఎస్‌యూ రాజకీయాల్లోకి రావడంతో పోటీ క్రమంగా రాజకీయ రంగు సంతరించుకుంది. 1972లో విద్యార్థులు 50 రోజుల పాటు ఆందోళన చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిపాలన అంగీకరించడంతో 1973లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి నాలుగు ప్రధాన పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నాలుగు పదవులనూ ఏబీవీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. న్యాయ విభాగం నుంచి ఎన్నికైన అరుణ్ జైట్లీ ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాతి ఏడాది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

1991లో ఎన్నికల రద్దు.. 
మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు వ్యతిరేకంగా జరిగిన రిజర్వేషన్ ఆందోళనల నేపథ్యంలో 1991లో తొలిసారి డీయూఎస్‌యూ ఎన్నికలు రద్దయ్యాయి. అనంతరం విద్యార్థి ఎన్నికల్లో పెరుగుతున్న ప్రచార వ్యయం, వాహన ర్యాలీలు తదితర అంశాలపై 2005లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. జేఎం లింగ్డో కమిటీ మార్గదర్శకాలను రూపొందించింది. ఒక్కో అభ్యర్థి ప్రచారానికి గరిష్ఠంగా రూ.5,000 ఖర్చు చేయాలని, పోస్టర్లు, ముద్రిత ప్రచార సామగ్రి, వాహనాలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై పరిమితులు విధించాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఈ సిఫారసులను విద్యార్థి ఎన్నికలకు మార్గదర్శకంగా ఆమోదించింది. అయితే నిబంధనల ఉల్లంఘనలపై తరువాత కూడా వివాదాలు కొనసాగాయి.

2023 నుంచి మళ్లీ హైకోర్టు నిఘా
కోవిడ్ కారణంగా డీయూఎస్‌యూ ఎన్నికలు నాలుగేళ్లపాటు నిలిచిపోయాయి. 2023లో ఎన్నికలు తిరిగి ప్రారంభమైనప్పుడు గోడలు, మెట్రో స్టేషన్లు, యూనివర్సిటీ గేట్లపై అక్రమ పోస్టర్లు, బ్యానర్లు, గ్రాఫిటీపై విమర్శలు వచ్చాయి. 2024లో ఢిల్లీ హైకోర్టు ప్రజా ఆస్తులను అభ్యర్థులు, విద్యార్థి సంఘాలే తమ ఖర్చుతో శుభ్రం చేసి పునరుద్ధరించే వరకు ఓట్ల లెక్కింపును నిలిపివేసింది. 2026 ఎన్నికల ప్రచార సమయంలోనూ హింస, నిబంధనల ఉల్లంఘనలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. తాజా చర్యల్లో 140 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ కాగా, కోర్టు విజయోత్సవ ర్యాలీలపై కూడా నిషేధం విధించింది.

ఇదీ చదవండి: నవరాత్రి వేళ.. అద్దెకు ‘గర్బా’ పార్ట్‌నర్‌ వివాదం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement