బిహార్‌లో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం  | Two Class 10 students in Bihar were harassed, three arrested | Sakshi
Sakshi News home page

బిహార్‌లో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం 

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

Two Class 10 students in Bihar were harassed, three arrested

టీనేజీ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించిన ఏడుగురు ఆగంతకులు 

లైంగిక దాడికి యత్నం 

వదిలేయాలని బతిమిలాడినా విన్పించుకోని వైనం 

బిహార్‌ సర్కార్‌పై విమర్శల వెల్లువ 

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

జముయీ/న్యూఢిల్లీ: బిహార్‌లో ఇద్దరు టీనేజీ విద్యార్థులను ఏడుగురు ఆగంతకులు దారుణంగా వేధించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దుశ్శాసన పర్వంపై రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని మరో నలుగురి కోసం వేట మొదలెట్టారు.  

అసలేం జరిగింది? 
జముయీ జిల్లా కేంద్రానికి చెందిన ఒక టీనేజీ అమ్మాయి, టీనేజీ అబ్బాయి ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. సెప్టెంబర్‌ 19వ తేదీన కోచింగ్‌ సెంటర్‌లో క్లాసుకు వెళ్లి అటు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మడ్వా పహాడ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా వీళ్లను గమనించిన కొందరు ఆగంతకులు మార్గమధ్యంలో వీళ్లను లఖీసరాయ్‌ రోడ్డుపై 7 గంటల సమయంలో అడ్డగించి దారుణంగా వేధించారు. వదిలేయాలని అమ్మాయి కాళ్లావేళ్లా పడిన కనికరం చూపలేదు. అమ్మాయిపై లైంగికదాడికి యత్నించారు. ఇదంతా ఒక ఆగంతకుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. 

టీనేజీ అబ్బాయిని కొట్టారు. పారిపోయేందుకు ప్రయత్నించిన టీనేజర్లను వెంటబడిమరీ ఆగంతకులు వేధించారు. అల్లరిమూకలో ఒకడు అమ్మాయిని గట్టిగా అదిమిపట్టి ఎత్తుకెళ్లే ప్రయత్నంచేశాడు. ఈ దారుణోదంతం తాలూకు వీడియో ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని బైక్‌ నంబర్‌ప్లేట్‌ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. సబ్‌ డివిజనల్‌ మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ దీప్తీ మోనాలీ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జుమాయీ ఎస్పీ బిశ్వజీత్‌ దయాళ్‌ తెలిపారు. భారతీయ న్యాయసంహిత చట్టం, పోక్సో చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

అంధభక్తులకు ఇది సాధారణం: రాహుల్‌ 
ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బిహార్‌లోని బీజేపీ ప్రభుత్వహయాంలో అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందన్నారు. ‘‘టీనేజీ అమ్మాయి చేతులు జోడించి బతిమాలింది. అయినాసరే వాళ్లు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు. వాళ్లకీ స్వేచ్ఛ ఎవరిచ్చారు?. అమ్మాయి ఏడు గంటలకు కూడా రోడ్డుపై వెళ్లలేని దుస్థితి ఎందుకొచి్చంది? ఇది పితృస్వామ్య వ్యవస్థ తాలూకు దురహంకారం కాదా? ఇంతటి దారుణ ఘటనను కొందరు అంధభక్తులు సాధారణ విషయంగా చిత్రీకరించే దుస్సాహసం చేస్తున్నారు. 

అందుకే ఇలాంటి అల్లరిమూకలు తామేదో ‘సంస్కృతి’ని కాపాడే వ్యక్తులుగా ఇలాంటి దారుణాలకు తెగిస్తున్నారు. నిందితులను పోక్సో చట్టం కింద విచారించి కఠిన శిక్షలు వేయాలి’’అని రాహుల్‌ డిమాండ్‌చేశారు. ఘటనపై బిహార్‌ శాసనసభలో విపక్ష నేత, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ స్పందించారు. ‘‘బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి అసమర్థమైన బిహార్‌ సీఎంగా మిగిలిపోయారు. ఇలాంటి ఘటనకు ప్రధాని మోదీ బాధ్యతవహించాల్సిందే’’అని డిమాండ్‌ చేశారు. 

నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్‌ 
ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్పందించింది. వెంటనే నిందితులను అరెస్ట్‌చేసి చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని బిహార్‌ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహాత్కార్‌ ఆదేశాలు జారీచేశారు. ఏడు రోజుల్లోపు ఈ అంశంలో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఘటనపై బిహార్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అప్సరా మిశ్రా సైతం జిల్లా మేజిస్ట్రేట్ ను నివేదిక కోరారు. ఘటనపై తృణమూల్‌కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌శర్మ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement