26 ఏళ్ల ఎమ్మెల్యే మైథిలీపై ట్రోలింగ్‌.. వాళ్లకు గడ్డి పెట్టిన కంగనా రనౌత్‌ | Maithili Thakur trolled Kangana gave a befitting reply | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల ఎమ్మెల్యే మైథిలీపై ట్రోలింగ్‌.. వాళ్లకు గడ్డి పెట్టిన కంగనా రనౌత్‌

Sep 20 2026 7:39 PM | Updated on Sep 20 2026 7:43 PM

 Maithili Thakur trolled Kangana gave a befitting reply

బిహార్‌లోని అలీనగర్‌ ఎమ్మెల్యే, జానపద గాయని మైథిలీ ఠాకూర్‌ (26) ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారులో కనిపించడంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ స్పందిస్తూ మైథిలీకి మద్దతుగా నిలిచారు.

మైథిలీ ఠాకూర్‌ 2025లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం బిహార్‌లోని అలీనగర్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల పంచాయత్‌ ఆజ్‌తక్‌ కార్యక్రమంలో తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల గురించి ఆమె మాట్లాడారు. ఇదే సమయంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, ట్రోలింగ్‌ మొదలైంది.

మైథిలీ సుమారు రూ.13 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే ఆమె ఈ కారును కొనుగోలు చేశారంటూ పలువురు పోస్టులు చేశారు. అయితే ఆ కారుకు యజమాని ఎవరో మాత్రం ధ్రువీకరించలేదు.

ఎన్నికల అఫిడవిట్‌లో మైతిలీ ఒక హోండా యాక్టివా స్కూటర్‌, రూ.3 నికర ఆస్తులను ప్రకటించారు. దీంతో కొన్ని నెలల్లోనే రూ.13 కోట్ల కారును ఎలా కొనుగోలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు, ట్రోలింగ్‌ మొదలయ్యాయి. అయితే కారును ఆమె కొనుగోలు చేశారనే విషయాన్ని ఏ ప్రముఖ సంస్థ కూడా నిర్ధారించలేదు.

ఈ ట్రోలింగ్‌పై కంగనా రనౌత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా స్పందించారు. “మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. కానీ మాకు ఉద్యోగం, వృత్తి, జీవితం, ప్రజాదరణ కూడా ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు. ప్రజల డబ్బును వాడాలన్న ఆసక్తి తమకు లేదని, అయితే రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ పేదరికంలోనే, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉండాలని ఆశించడం తర్కరహితమని అన్నారు.

మైథిలీపై జరుగుతోన్న చర్చలో ప్రధానంగా కారు యాజమాన్యం, ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలపైనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. కారు యజమాని గురించి స్పష్టత వచ్చే వరకు ఈ అంశంపై వస్తున్న వాదనలను నిర్ధారిత వాస్తవాలుగా చూడలేం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement