ముంబై: ముంబై కోస్టల్ రోడ్డుపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బీఎండబ్ల్యూ కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీఅలీ వైపు కోస్టల్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందుగా బ్రిడ్జి గోడను ఢీకొట్టి.. అక్కడి నుంచి కిందకి పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్ల పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంపై తెల్లవారుజామున 5:20 గంటల సమయంలో కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. కారులో ఉన్న నలుగురినీ వెంటనే నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు.
మృతులను షనాయ్ గజ్జల్(21), ధైర్య దర్శన్ సేథ్(17), ఆదిత్య జకాస్నియా(19)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్(23)కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Three killed, one injured as speeding BMW crashes on Coastal Road in Mumbai.#Mumbai #BMWcrash pic.twitter.com/Mt0fXslLdN
— Ravinder Singh (@ravindraJourno) September 20, 2026
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..


